సరే ఇవన్నీ జరిగాయి. ప్రభుత్వం ముందడుగు వేసి ఆ హీరోను అరెస్టు చేసి చివరికి కోర్టు ఆదేశాలతో హీరో అల్లు అర్జున్ బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఇది ఇక్కడితో ఆగితే బాగుండేది చివరికి ఇది ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అనే దిశగా సాగుతోంది. హీరో అల్లు అర్జున్ పరామర్శల పరంపర రెండున్నర రోజులపాటు కంటిన్యూగా కొనసాగింది. చిన్న నటుల దగ్గర నుంచి పెద్ద యాక్టర్ల వరకు అందరూ బన్నీ ఇంటికి క్యూ కట్టారు. గమ్మత్తు ఏమిటంటే ఒక్క హీరోయిన్ కానీ మహిళా నటి కానీ వెళ్ళలేదు. పైగా లైవ్ స్ట్రీమ్ పెట్టి ఒకటే హడావుడి చేశారు. రెండు రోజులు పాటు మీడియాకు ఇదే హడావుడి సరిపోయింది. ఇదంతా ఓ సక్సెస్ మీట్‌లా .. ఓ విక్టరీ ఈవెంట్ల .. ఇంకా చెప్పాలి అంటే ప్రభుత్వం మీద బన్నీ సాధించిన గెలుపు అనేలా సాగిందన్న చర్చలు కూడా వినిపిస్తున్నాయి.
జైలు నుంచి విడుదల అయ్యాక సైలెంట్ గా ఉంటే సరిపోయేది. అసలే రేవంత్ రెడ్డి మీద బన్నీ చేసిన కామెంట్లు .. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం కూడా ఇక్కడ ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి యాక్షన్ మొదలైంది. అసలు సంధ్య థియేటర్‌కు అనుమతులు .. సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్నది లాగటం మొదలైంది ? ఏ థియేటర్ అయిన ప్రభుత్వం తలుచుకుంటే అక్కడితో దాని కథ ముగుస్తుంది. రన్నింగ్ టైం లో బాత్రూంలో చెక్ చేస్తే చాలు సీజ్ చేసేయొచ్చు. బన్నీ బాగానే ఉంటారు.. బన్నీ పరామర్శలు బాగానే ఉంటాయి. వెళ్లిన నటీనటులు అందరూ బాగుంటారు.. కానీ ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడుతుంది.
థియేటర్లు .. ప్రీమియర్లు టికెట్ రేట్లు ఒకటి కాదు రెండు కాదు చాలా సమస్యలు ఉంటాయి. బన్నీ బెయిల్‌పై వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండి లైవ్ స్ట్రీమింగ్ హడావిడి లేకుండా ఉంటే అటు ప్రభుత్వం కూడా లైట్ తీసుకునేది. ఇప్పుడు ఈ హడావిడితో అటు ప్రభుత్వం కూడా పవర్ ఏంటో చూపించడానికి రెడీ అవుతుందా ? అన్న అనుమానాలు కలగక మానవు.