ఏపీ క్యాబినెట్లో మార్పులు చేర్పులకు టైం దగ్గర పడుతోంది. క్యాబినెట్లో ఖాళీగా ఉన్న ఒక్క స్థానాన్ని భర్తీ చేస్తారు .. కానీ శాఖల మార్పు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. టిడిపి సంగతి పక్కన పెడితే జనసేన నుంచి మంత్రి అవుతున్న నాగబాబుకు పవన్ నిర్వహిస్తున్న కీలక శాఖలను కూడా ఇస్తారని చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి చేతిలో చాలా శాఖలు ఉన్నాయి. ఆయన ఎంతో మనసుపెట్టి తీసుకున్న శాఖలు అవి. ప్రస్తుతం ఏపీ ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో పర్యావరణం తో పాటు పంచాయితీ రాజ్ అలాగే గ్రామీణ అభివృద్ధి - అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ - గ్రామీణ నీటి సరఫరా శాఖలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన మనసుపెట్టి తీసుకున్న శాఖలే కావడం విశేషం. ప్రస్తుతం వీటిలో అటవీ శాఖను పవన్ కళ్యాణ్ వదులుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
పవన్ తన సోదరుడు కొణిదెల నాగబాబు మంత్రివర్గంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఆయనకు అటవీ శాఖను అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ తన పెండింగ్ సినిమాలను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ మంగళగిరిలో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతుంది . ఆ తర్వాత ఓజి షూటింగ్లో జాయిన్ కాబోతారు. ఆ తర్వాత హరీశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ క్రమంలో పవన్ పై ఒత్తిడి తగ్గించేందుకు అటవీ శాఖ ను నాగబాబుకి అప్పజెప్పే ఆలోచనలో ఉన్నారు జనసేన పెద్దలు. మరో జనసేన నేత కందుల దుర్గేష్ వద్ద మూడు శాఖలు ఉన్నాయి. ఇందులో సినిమాటోగ్రఫీ నాగబాబుకి అప్పగిస్తారని తెలుస్తోంది. దీనివల్ల నాగబాబుకి అటవీశాఖ తో పాటు సినిమాటోగ్రఫీ లాంటి కీలక శాఖలు చెప్పినట్టు అవుతోంది. మధ్యలో మార్పులు చేర్పులు లేకపోతే నాగబాబుకు ఈ రెండు శాఖల కేటాయించడం దాదాపు ఖరారు అయినట్టే అని జనసేన వర్గాలు చెబుతున్నాయి.