రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి ఎలా లెక్ కలిసి వస్తుందో చెప్పలేం. నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలుగుదేశం పార్టీతో రాజకీయాలు ప్రారంభించిన ఆయన ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి 1983లో సత్తుపల్లి నుంచి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత అని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన హవా చెలాయించారు. ఆ తర్వాత సీన్ మారింది .. రాష్ట్ర విభజన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ అయ్యారు. పాలేరు ఉప ఎన్నికలలో విజయం సాధించారు.
2018 లో తెలంగాణలో జరిగిన ముందస్తు సాధారణ ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. దీంతో రాజకీయంగా ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చివరకు 2023 ఎన్నికల నాటికి ఆయన బిఆర్ఎస్ పార్టీలోనే టిక్కెట్ తెచ్చుకోలేని స్థితికి దిగజారి పోయారు. తుమ్మల రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోతుందని అందరూ అనుకున్నారు. ఆ టైంలో ఆయన అనూహ్యంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవటం పాలేరు నుంచి ఖమ్మం కు మారి రాజకీయంగా తనను అణగదొక్కేందుకు ప్రయత్నించిన అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ పై ఘనవిజయం సాధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో కూడా మంత్రి అయ్యారు.
విచిత్రం ఏంటంటే తుమ్మల తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో మూడు పార్టీలు మారి మూడు పార్టీల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మూడు నియోజకవర్గాలు మారి మూడు చోట్ల ఎమ్మెల్యేగా గెలిచి .. అలాగే ఈ మూడు నియోజకవర్గాలలోను ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అలాగే మూడు పార్టీలలోను మంత్రి అయిన అరుదైన రికార్డు తుమ్మల నాగేశ్వరరావు సొంతం అయింది. రాజకీయంగా తుమ్మల పని అయిపోయింది అనుకుంటున్న టైంలో అనూహ్యంగా ఆయన బ్యాక్ బౌన్స్ అయ్యారు.