పుష్ప2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో తెలంగాణ ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ మధ్య దూరం పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది.ఈ ఘటనపై ఇప్పటికే చాలామంది రాజకీయ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణమని చెప్పవచ్చు. ఇదే అంశంపై తాజాగా సినీ నటి, కాంగ్రెస్‌ నాయకురాలు మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆమె ఇలా చెప్పుకొచ్చారు.ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ సంఘటన చాలా దురదృష్టకరం. అయితే, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలలో ఇదే కనిపిస్తుంది. ఈ ఘటన తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన తెలుగు రాష్ట్రాల నేతల ప్రకటనలు ఉన్నాయి. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి.. అలా కాకుండా మళ్లీ ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది.

సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయం. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ అవసరం. ఇలాంటి ఘటనలు జరగకుండా సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి.. పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి.' అని పేర్కొన్నారు.పుష్ప2 సినిమా విడుదల సమయంలో డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ఈ ఘటనపై రాజకీయ నాయకుల కామెంట్లు వల్ల పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా రేవతి మరణం గురించి వ్యాఖ్యలు చేయండంతో పాటు ఆ సమయంలో అల్లు అర్జున్‌ వ్యవహరించిన తీరు బాగాలేదని ఆయన అన్నారు. దీంతో అల్లు అర్జున్‌ కూడా మీడియా సమావేశం పెట్టి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. ఆపై పలు రాజకీయ పార్టీ నేతలు బన్నీకి సపోర్ట్‌గా మాట్లాడటంతో వివాదం మరింత ఎక్కువ అయింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: