అల్లు అర్జున్ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పందించిన అల్లు అర్జున్.. ఈ వ్యాఖ్యల పైన మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో, పోలీసులు సైతం వీడియో ల ద్వారా సంధ్యా థియేటర్ లో ఏం జరిగిందో వివరించారు. అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని..ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటీషన్ వేసేందుకు పోలీసులు నిర్ణయించారు.
సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. సినీ పరిశ్రమ స్పందించిన తీరు గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. బాధిత కుటుంబం పరిశ్రమ పెద్దలకు పట్టదా అంటూ ప్రశ్నించారు. సినీ హీరోలకు ప్రత్యేకంగా చట్టం ఉండదని.. స్పెషల్ ఇన్సెంటివ్ కావాలంటే తీసుకోండి కానీ, స్పెషల్ ప్రివిలేజ్ కావాలంటే తాను సీఎం సీట్లో ఉన్నంత వరకు సాధ్యం కాదని రేవంత్ తేల్చి చెప్పారు.
ప్రమాదంలో ఎవరి తప్పు లేదని.. తనకు మృతి చెందిన సమాచారం మరుసటి రోజు వరకు తెలియదని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. స్పందించిన హైదరాబాద్ పోలీసులు వీడియోలతో సహా ఏం జరిగిందో వివరించారు. ఇక, అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడారని భావిస్తున్నారు. దీంతో, ఆయన బెయిలు ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అర్జున్ హైకోర్టు ఆదేశాలతో విడుదలైనప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూ డదని న్యాయనిపుణులు గుర్తు చేస్తున్నారు. రేవతి మృతి విషయం ఎవరూ తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అర్జున్ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు చెబుతున్నారు.