ఒక్కసారి వెనక్కి వెళితే... సరిగ్గా 2009లో మన్మోహన్ సింగ్‌కు 10 గంటలకు పైగా క్లిష్టమైన హార్ట్ సర్జరీ జరిగింది. ఆ తరువాత అయన క్రమంగా కోలుకున్నారు. ఈ క్రమంలో శ్వాస తీసుకోవడానికి వీలుగా అమర్చిన ఒక పైప్ తిలగించిన సమయంలో డాక్టర్ రమాకాంత్ ని మన్మోహన్ దేశం గురించే అడిగారట. "నా దేశం ఎలా ఉంది? కశ్మీర్ పరిస్థితి ఏంటి? నా గురించి నాకు ఎలాంటి బెంగా లేదు. నా ఆలోచనంతా నా దేశం గురించే" అని ఆయనతో మన్మోహన్ అడిగినట్టు వైద్యుడు వెల్లడించారు. కాగా, ఎయిమ్స్ ఢిల్లీలోనే ఈ సర్జరీ జరిగిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది.
ఇకపోతే మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకూ దేశాన్ని ప్రగతిపథంలో నడిపించారు. అంతకుముందు ఆర్థిక మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా వ్యవహరించిన మన్మోహన్ ఆ తరువాత కాలంలో ఫుల్ టైం రాజకీయాల్లోకి ప్రవేశించారు. కీలక బాధ్యతల నడుమ పలు లగ్జరీ కార్లలో ప్రయాణించిన ఆయనకు ఇవేవీ అంతగా నచ్చేవి కావట. తన సొంత 'మారుతి 800'కారు అంటేనే ఆయనకి చాలా ఇష్టముండేదట. ఆయన హయాంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) చీఫ్‌గా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి అరుణ్ అసిమ్ ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. 2004 నుంచి 2007 వరకూ మన్మోహన్ భద్రత బృందం ఎస్‌పీజీకి అరుణ్ హెడ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన యూపీలోని (UP) కన్నౌజ్ సదర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అరుణ్.. మన్మోహన్ వద్ద పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.