అసలు విషయంలోకి వెళ్తే నాగార్జునసాగర్ వద్ద శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డ్యాం వద్ద భద్రతా విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ బలగాలు హఠాత్తుగా వెనక్కి తగ్గడంతో గందరగోళం నెలకొంది. కేంద్ర హోం శాఖ నుంచి ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండానే ఈ చర్య జరగడం అనేక అనుమానాలకు తావిచ్చింది.
తెలంగాణ వైపు ఉన్న సీఆర్‌పీఎఫ్ యూనిట్లు తమ ప్రధాన కేంద్రమైన ములుగుకు తరలి వెళ్లగా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వద్ద ఉన్న బలగాలు సైతం విశాఖపట్నం వెళ్లడానికి సిద్ధమయ్యాయి. అయితే, రవాణా ఏర్పాట్లు ఆలస్యం కావడంతో వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో, సీఐఎస్‌ఎఫ్ దళాలు రాకముందే తెలంగాణ ప్రత్యేక పోలీసులు (SPF) రంగంలోకి దిగి తమ రాష్ట్ర పరిధిలో మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ఆకస్మిక ఉపసంహరణ వెనుక గల కారణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము వెనక్కి తగ్గామని సీఆర్‌పీఎఫ్ అధికారులు చెబుతున్నప్పటికీ, కేంద్ర హోం శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ ఘటన రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలపై, డ్యాం భద్రతపై చర్చకు దారితీసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేక పోలీసులు సాగర్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇంత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా సైలెంట్ గా ఉంది. గతంలో ఇలాగే జరిగితే జగన్ వెంటనే ఏపీ పోలీసులను పంపించే దానిని తిరిగి తీసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సాగర్ తెలంగాణ వారి చేతుల్లోకి వెళ్లిపోవడం చంద్రబాబు నిమ్మకి నీరు ఎత్తినట్లు వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.