వైసీపీ ప్రభుత్వం గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా.. ఎవరు నోరు విప్పినా.. వాలంటీర్లు-సచివాలయ వ్యవస్థలను విస్మరించలేరు. వైసీపీ వస్తూ వస్తూనే తొలి మూడు మాసాల్లోనే వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చింది. ఇది ఒక రికార్డు కార్యక్రమం. కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారు గతంలో ఇదే విషయాన్ని ఒప్పుకొన్నారు కూడా.
ఈ ఏడాది ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో అప్పటి వరకు తనవారే అనుకున్న వాలంటీర్లు .. జగన్‌కు ఎదురు తిరిగారు. పరోక్షంగా వారు కూటమి పార్టీల తరఫున ప్రచారం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారిని పూర్తిగా పక్కన పెట్టింది. అసలు వ్యవస్థే లేనప్పుడు.. మేం ఏం చేస్తాం అంటూ.. సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా చెబుతున్నారు. సో.. వలంటీర్లు ఇప్పటికైతే.. ముగిసిన చరిత్రే.
ఇటీవల తాడేపల్లి వద్ద కొందరు వాలంటీర్లు ఆందోళన చేశారు. ఆ విషయం మీడియాలో పెద్దగా రాలే దు. తమను చేర్చుకున్నది వైసీపీ కాబట్టి.. తమకు ఉద్యోగాలు కల్పించేలా ఉద్యమం చేయాల్సిన బాధ్యత కూడా వైసీపీపైనే ఉందన్నది వాలంటీర్లు చెప్పిన మాట. కానీ, ఈ విషయాన్ని జగన్ సీరియస్‌గా లేదు. పైగా.. ఆయన పార్టీ నేతల అభిప్రాయాలనే ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటున్నారు.
వాలంటీర్ల వల్ల తమకు ప్రజలకు మధ్య బంధం చెడిపో యిందని మెజారిటీ నాయకులు చెబుతున్నారు. దీంతో వాలంటీర్లు అనే మాటే వినిపించేందుకు వారు ఇష్టపడడం లేదు. దీంతో జగన్ కూడా.. వాలంటీర్ల వల్లే నష్టం ఎక్కువగా జరిగిందని అంచనాకు వచ్చినట్టు తెలిసింది. నిజానికి వచ్చే ఏడాది నుంచి అయినా.. వాలంటీర్లకు మేలు జరగాలని ఆయన కోరుకున్నారు. కానీ, మెజారిటీ పార్టీ నాయకులు వాలంటీర్లను తీవ్రంగా వ్యతిరేకించడంతో జగన్ ఈ విషయాన్నిపక్కన పెట్టేశారు.
అంతేకాదు.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. వైసీపీ కనుక అధికారంలోకి వస్తే.. వాలంటీర్ల ప్రస్తావన ఈ సారి ఉండదని సీనియర్ నాయకులు చెబుతున్నారు. మరోవైపు.. 2025లో జన్మభూమికమిటీలను ఏర్పాటు చేసేందుకు.. కూటమి సర్కారు ప్రయత్నిస్తోంది. అయితే.. దీనికి వేరే పేరు పెట్టే అవకాశం ఉందని.. `పీపుల్ రెస్పాన్స్ టీం`గా పేరు పెట్టవచ్చని కూటమి నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రతిపాదనల దశలో ఉందని సమాచారం.