విచిత్రం ఏంటంటే.. టీడీపీలో చేరేందుకు కుదరని పక్షంలో.. జనసేన కండువా కప్పుకుని చాలా తెలివిగా రాజకీయం చేస్తున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు కూడా ఇప్పటికే జనసేనలో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మంగళగిరిలో గత ఎన్నికలకు ముందు వైసీపీలో ఉండి నారా లోకేష్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తానని శపధం చేసిన నేత ఇప్పుడు జనసేనలో చేరిపోయారు. 2014 ఎన్నికలలో టీడీపీ నుంచి మంగళగిరి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు గంజి చిరంజీవి. అనంతరం లోకేష్ ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయినా 2019 ఎన్నికలలో పార్టీ ఓడిపోయాక చిరంజీవి.. వైసీపీ కండువా కప్పుకుని కొద్ది కాలం పాటు మంగళగిరి వైసీపీ ఇన్చార్జిగా ఉన్నారు.
లోకేష్ పై పోటీ చేసేందుకు సవాళ్లు రువ్వారు చిరంజీవి. వైసీపీ ఆయనకు సీటు ఇవ్వకుండా మొరుగుడు లావణ్య కు ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో ఆ పార్టీలో ఉంటే రాజకీయంగా తనకు ఇబ్బందులు తప్పవని భావించిన గంజి చిరంజీవి.. జనసేన కండువా కప్పుకున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కు ఎంత మాత్రం రుచించడం లేదు. ఇలాంటి పరిస్థితి ఒక్క మంగళగిరిలో మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ నేతలు కక్కలేక.. మింగలేక.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.