డ్రగ్స్ తో వ్యాపారం చేస్తే ఉరిశిక్ష వేయాలని  సినీ నటుడు సుమన్ సంచలన వాఖ్యలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ లో కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమంలో సుమన్ హాజరయ్యారు. డ్రగ్స్ తో వ్యాపారం చేస్తూ యువతను పక్కమార్గం పట్టించి , జీవితాలను నాశనం చేయడమే కాకుండా దేశ భవిష్యత్తును దెబ్బతీస్తున్న  వ్యక్తులను ఉరి తీయాలని టాలీవుడ్ సినీ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో  సాయినాథ్ యాదవ్, ఉపేశ్ యాదవ్ లు నిర్వహిస్తున్న  మల్లేష్ యాదవ్ స్మారక   కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో  రాజధాని వేదికగా డ్రగ్స్ వ్యాపారం  కొనసాగుతుందని సినీ నటుడు సుమన్ అన్నారు.  భవిష్యత్తు ఉన్న యువకులు, విద్యార్థులు డ్రగ్స్ కి అలవాటు పడి తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని సుమన్  ఆవేదన వ్యక్తం చేశారు.


మద్యం లివర్ పైన మాత్రమే ప్రభావం చూపుతుందని, డ్రగ్స్ మాత్రం మెదడు మీద ప్రభావం చూపి జీవితాన్ని నాశనం చేస్తుందని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. డ్రగ్స్ వాడకంతో సమాజంలో ఎంతో పరువు పోయే అంశంగా మారిందన్న సుమన్‌..  కుటుంబాలు చిన్నాబిన్నం కావడమే కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా డ్రగ్స్ వాడితే ఆ కుటుంబానికి కూడా చెడ్డ పేరు వస్తుందని సుమన్ అన్నారు. డ్రగ్ మత్తులో కన్న తల్లిదండ్రులను స్నేహితులను చుట్టుపక్కల వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారని డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించ వలసిన అవసరం ఉందని సుమన్‌ అభిప్రాయపడ్డారు. పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకునే తల్లిదండ్రులు డ్రగ్స్ కు బానిసలైన వారి అవస్థలు చూసి కుమిలిపోతున్నారని సుమన్‌ అన్నారు. డ్రగ్స్ అలవాటు అయిన యువకుడు ఇంట్లో ఉంటే వారి కుటుంబంలో ఉండే అక్కాచెల్లెళ్లకు కూడా వివాహం కాని పరిస్థితి నెలకొని ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ను నియంత్రించే దిశగా అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సుమన్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: