ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి సర్కారు మరో హామీ అమలుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయం వెల్లడించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మరో హామీని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ టీడీపీ పోస్ట్ చేసింది. ఎన్నికల సమయంలో సూపర్స్ సిక్స్ గ్యారెంటీలతో పాటు టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చింది. ఈ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పటి వరకూ సూపర్ సిక్స్ హామీల్లోని సామాజిక భద్రతా పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా ఉగాది నుంచి ప్రారంభిస్తామని తెలిపింది.అలాగే విద్యార్థులకు ఏడాదికి రూ.15000 అందించే తల్లికి వందనం పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అలాగే రైతులకు ఏడాదికి రూ.20000 అందించే అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ యోజనతో కలిపి ఇస్తామని తెలిపింది. ఇవి కాక ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, నూతన మద్యం విధానం, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి నిర్ణయాలను తీసుకున్నారు. 

తాజాగా ఏప్రిల్ ఒకటి నుంచి 1.43 కోట్ల కుటుంబాలకు రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా అందించే పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ పోస్ట్ చేసింది. ఇందుకోసం ప్రతి కుటుంబం తరుఫున ప్రభుత్వమే రూ.2500 ప్రీమియం చెల్లిస్తుందంటూ పోస్ట్ చేసింది.అసలు విషయంలోకి వస్తే ఆరోగ్య శ్రీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పులు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి. అయితే ఏప్రిల్ ఒకటి నుంచి బీమా విధానంలో ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు సేవలు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ వైద్యరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆరోగ్య సేవలను బీమా విధానంలో అందించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం పరిధిలోని అన్ని చికిత్సలను బీమా విధానంలోనూ కొనసాగిస్తామన్నారు. అవసరమైతే చికిత్సల సంఖ్యను పెంచుతామని.. 25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు.అయితే ప్రస్తుతం ఉన్న విధానం తరహాలో కాకుండా.. ఆరోగ్య సేవలకు బీమా విధానం అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap