గురువారం ఉదయం తెల్లవారు ఝామున దారిగ్గా 5 గంటల నుంచి ఎస్ఎస్‌డీ టోకెన్లు జారీచేసేందుకు ఏర్పాట్లు చేయగా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు బుధవారం సాయంత్రం నుండే కౌంటర్ల వద్దకు జనాలు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ కోసం తిరుపతిలో 8 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎనిమిది కేంద్రాలలో మొత్తం 90 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరగా శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగి పట్టెడ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటన జరిగింది. క్యూలైన్లలోకి ఒక్కసారిగా జనాలను వదలటంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
ఈ విషయమై ఘటనా స్థలిలోని ఓ డీఎస్పీని భక్తులు నిలదీయగా ఆయన ధర్మబద్ధంగా స్పందించలేదని గుసగుసలు వినబడుతున్నాయి. దాంతో చాలామంది ఏపీ ప్రభుత్వాన్ని కూడా నిందిస్తున్నారు. గడిచిన ఐదేళ్లు వైసీపీ హయాంలో టిటిడి భ్రష్టుపట్టిందని విమర్శలు గుప్పించిన కూటమి ప్రభుత్వం తాజా ఘటనపై ఎలా స్పందిస్తుందని ప్రశ్నిస్తున్నారు. అవినీతి సంగతి దేవుడెరుగు కానీ ఇలా ఎప్పుడూ కూడా అక్కడ ప్రాణనష్టమే జరగలేదని.. ప్రభుత్వం తప్పిదం వల్లనే ఇలాంటి ఘటన చోటుచేసుకుందని అనుమానిస్తున్నారు.
కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీసినట్టు సమాచారం. కలెక్టర్, ఎస్పీ, టీటీడీ అధికారులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. తనను ఎంతో కలిచివేసిందన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.