సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కావడానికి తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏకంగా 90 టోకెన్ జారీ కౌంటర్లను ఏర్పాటు చేయగా బుధవారం రాత్రి ఇలా గేట్లు తెరవగానే భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో... పలుచోట్ల తొక్కిసలాట ఘటనలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు. ఈ విషాదంలో ఆరుగురు మరణించగా... వారిలో ఐదుగురు మహిళలే కావడం గమనార్హం. ఇక ఈ ఘటనలతో మరణాలతో పాటు పెద్దసంఖ్యలో భక్తులు కూడా గాయపడ్డారు. వారికి తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
అయితే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాట సమయంలోని దొరికిన దృశ్యాలను చూస్తుంటే హృదయం కలచి వేస్తోంది. ఈ క్రమంలో జనాలు నేలకొరిగినవారిని రక్షించడం కోసం పడే తపన చూస్తే హృదయవిదారకంగా అనిపించకమానదు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా... బైరాగిపట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది. క్యూలైన్లలోకి రాత్రి 9 గంటల నుంచి భక్తులను పంపించడం మొదలు పెట్టడంతో కేంద్రాల వెలుపల నిరీక్షిస్తున్న భక్తులు క్యూలైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాటలు జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా... బైరాగిపట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి. భక్తుల్లో మహిళలు, వృద్ధులు కూడా ఉండడంతో చాలామంది కిందపడిపోయారు. సదరు పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఎంత యత్నించినా వృధా ప్రయాస అయింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.