ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు.. ఆ సమయంలో ఒక భక్తుడికి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉందని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడి సిబ్బంది గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. వెంటనే మిగిలిన భక్తులు కూడా గేటు మీద పడటంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. అయితే, అక్కడ డీఎస్పీ సరైన రీతిలో స్పందించని కారణంతో పాటుగా భక్తులతో విధుల్లో ఉన్న టీటీడీ, పోలీసు సిబ్బంది సరిగ్గా వ్యవహరించలేదనే అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరోవైపు ఘటన జరిగిన వెంటనే అందుబాటులో ఉన్న అంబులెన్సుల నిర్వాహకుల పైన కూడా ఫిర్యాదులు ఉన్నాయి. గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకురాక పోవటంతో ప్రాణాపాయం ఏర్పడిందని చెబుతున్నారు.
అలా కాకుండా ఘటన జరిగిన సమయంలో టీటీడీ, పోలీసు అధికారుల మధ్య సమన్వయం లోపం ఏర్పడిందని కూడా స్థానికులు వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఇది అధికారుల వైఫల్యంగా టీటీడీ ఛైర్మన్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టడం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. కాగా, గతంలోనూ తొక్కిసలాట ఘటనలు ఉన్నాయి. కానీ, ప్రాణ నష్టం అనేది జరగలేదు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి.