తిరుపతి లోని వైకుంఠ ద్వార దర్శన  టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.దుర్ఘటనతో తాజా సమాచారం ప్రకారం.. ఆరుగురు ప్రాణాలు కోల్పో్యారు. అందులో నర్సీపట్నానికి చెందిన బి.నాయుడు బాబు 51, విశాఖకు చెందిన రజిని 47, లావణ్య 40, శాంతి 34, కర్ణాటక  రాష్ట్రానికి చెందిన బళ్లారికి చెందిన నిర్మల 50, తమిళనాడు రాష్ట్రంలోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక 49 ఉన్నారు. ఇదే ఘటనలో మరో 40 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అందులో మరో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా వైద్యులు రుయా ఆసుపత్రి వైద్యులు తెలిపారు.ఇదిలావుండగా ఘటన విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు మంత్రులు, టీటీడీ ఛైర్మన్, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో క్షతగాత్రులకు సహాయ చర్యలు, వైద్య సేవలు పర్యవేక్షించేందుకు మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ల బృందం తిరుపతికి చేరుకుంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిరంతరం టీటీడీ అధికారులతో మాట్లాడుతూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.ఈ క్రమంలోనే తిరుపతి లో జరిగిన తొక్కిసలాట ఘటనపై మరణింంచిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ఇదిలావుండగా తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుపతి, తిరుమలలో ఈనెల 9న ఉదయం 5 గంటల నుంచి టోకెన్ల జారీకి టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే భక్తులు ఒకరోజు ముందుగానే టోకెన్ జారీ కేంద్రాల వద్దకు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడి భారీగా జనం రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో తిరుమలలో ఇంతపెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: