మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ సుదీర్ఘంగా విచారించింది. అధికారులు దాదాపు ఏడు గంటల పాటు విచారణ చేశారు. కేటీఆర్ బయటకు వస్తారా..అరెస్ట్ చేస్తారా అనే సస్పెన్స్ కు తెర దించుతూ విచారణ పూర్తయిన తరువాత కేటీఆర్ బయటకు వచ్చారు. ఏసీబీ అడిగిన సమాచారం ఇచ్చానని.. ఎప్పుడు పిలిచినా విచారణ కు వస్తానని కేటీఆర్ చెప్పారు. అర్దం లేని ప్రశ్నలతో ఏసీబీ విచారణ సాగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఫార్ములా ఈ రేసు కేసు లో ఏసీబీ కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించింది. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అవినీతి చేసినట్లు ఆధారాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు కేటీఆర్ ను విచారణ చేసినట్లు తెలుస్తోంది.
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ప్రమేయం పై కొంత కాలంగా చర్చ సాగుతోంది. ఈ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి వచ్చిన సమయం నుంచి ఏసీబీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. న్యాయస్థానం అరెస్ట్ చేయవద్దంటూ మధ్యం తర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా క్వాష్ పిటీషన్ ను కొట్టివేసింది. దీంతో, కేటీఆర్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ ఇంకా కేసు విచారణకు రాలేదు. ఈ సమయంలోనే ఏసీబీ నోటీసుల మేరకు కేటీఆర్ ఈ రోజు విచారణకు హాజరయ్యారు.
కేటీఆర్ ప్రమేయం పైన ఏసీబీ అధికారులు సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా నిధుల విడుదల గురించే ఎక్కువగా ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, కేటీఆర్ తాను హైదరాబాద్ బ్రాండ్ ప్రమోషన కోసం మాత్రమే నిర్ణయం తీసుకున్నానని.. నిధుల విడుదలలో విధి విధానాలు హెచ్ఎండీఏ చూసుకోవాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, తాను ఎలాంటి అవినీతికి పాల్పడ లేదని కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. కాగా, ఈ రోజు విచారణలో కేటీఆర్ సమాచారం తో..మరోసారి విచారణకు రావాలంటూ ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.