ఒకే రోజులో ఊహించలేనంత మంది తరలివెళ్లడంతో హైదరాబాద్‌లో సందడి తగ్గిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెలు, పట్టణాలు మాత్రం కొత్త కళను సంతరించుకున్నాయి. ఎక్కడ చూసినా బంధువులు, స్నేహితుల సందడితో ఆ ప్రాంతాలన్నీ సందడిగా మారిపోయాయి.
ఏపీలో ఉన్న చాలామంది ఈ దృశ్యాన్ని చూసి మురిసిపోయారు. "ఇక్కడే ఉండిపోండి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం" అంటూ సోషల్ మీడియాలో ఎన్నో పిలుపులు వినిపించాయి. నిజానికి చాలామంది ఏపీలో ఉండాలని కోరుకుంటున్నారు. తమ కుటుంబాలతో సంతోషంగా గడపాలని, సొంతూరులో స్థిరపడాలని ఆశపడుతున్నారు. కానీ, బతుకుదెరువు కోసం, ఉద్యోగాల కోసం మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లక తప్పని పరిస్థితి. ఏపీలో ఆ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వారి కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి.
అయితే, సంక్రాంతి పండుగ ఏపీలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. రంగుల రంగవల్లులు, రుచికరమైన సంప్రదాయ వంటకాలు, కోలాటాలు, హరిదాసులు.. ఇలా ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలతో పండుగ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన అనుభూతి కోసమే కదా ఉద్యోగాలను సైతం పక్కనపెట్టి ఎంతోమంది హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వస్తుంటారు.
ఇక పండుగ ముగిసింది.. మళ్లీ హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్లు మొదలయ్యాయి. ఏపీ నుంచి లక్షలాది వాహనాలు మళ్లీ నగరానికి తిరుగు పయనం అవుతున్నాయి. సంక్రాంతి సందడి ముగియడంతో చాలామంది తిరిగి తమ పనుల్లో నిమగ్నం కానున్నారు. ఇలా పండగకు ఊళ్లకు వెళ్లడం, తిరిగి నగరాలకు రావడం అనేది ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఒక సాధారణ ప్రక్రియ. కానీ, ఈ వలసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక సవాలుగా నిలుస్తున్నాయి అనేది మాత్రం కాదనలేని వాస్తవం.