ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం పూర్తయింది. ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణ పనులు, పేదలకు భూ పంపిణీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో తల్లికి వందనం పథకం అమలుపై తీవ్రమైన చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాలను, ఉద్యోగులను మూడు విధాలుగా విభజించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.
కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకంలో డబ్బు జమ అయిన వెంటనే.. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ వేయాలని నిర్ణయించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమిని పేదలకు ఇవ్వడానికి తక్షణ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
పేదలందరికీ గృహనిర్మాణ పథకంలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు భూమిని కేటాయిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. 'గతంలో వారు ఎప్పుడూ ఇంటికి రుణం తీసుకుని ఉండకూడదు. వారు బిపిఎల్ కుటుంబాలై ఉండాలి. వారికి ఖచ్చితంగా ఆధార్ ఉండాలి. మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు, మాగాణి ప్రాంతంలో 2.5 ఎకరాలకు మించకూడదు.'అని మంత్రి తెలిపారు.
అంతే కాకుండా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు.ఆ స్థలాలు నివాసయోగ్యం కాదని, స్మశానవాటికల పక్కన, చెరువుల్లో స్థలాలు ఇచ్చారని ఫిర్యాదులు అందాయి. ఈ స్థలాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. గతంలో వారందరికీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి, మళ్ళీ నివాసయోగ్యమైన ప్రదేశాలలో స్థలాలు కేటాయిస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు కేటాయిస్తామన్నారు. గతంలో ఇళ్ల స్థలాలు పొందిన వారు ఇళ్లు నిర్మించకపోతే, ఆ స్థలాలను రద్దు చేస్తామని సూచించారు మంత్రి పార్థ సారథి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించి కాలనీలు నిర్మించాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీనితో పాటు ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ వాడాలని నిర్ణయించారు. కోర్టు కేసులను, ఇళ్లు నిర్మించని వారి స్థలాలను రద్దు చేస్తామని మంత్రి పార్థ సారథి ప్రకటించారు.