
ఇంట్లో వయసు పైబడిన వారు ఉన్నారంటే సరే వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. ఇంట్లో వారికి అడ్డుగా ఉంటున్నారని భావిస్తున్నారో లేక, వారు ఉండడం ఇష్టం లేకనో తెలియదు కానీ చాలామంది తల్లిదండ్రులను వదులుకుంటున్నారు. అక్కడ వారు ఎన్ని బాధలు పడతారు అని కూడా ఆలోచించకుండా వృద్ధాశ్రమంలో వేసి వారికి వారు సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు.
ఈ క్రమంలోనే వైయస్సార్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన గజ్జల రాములమ్మ (68), రాజమహేంద్రవరం నారాయణ పురానికి చెందిన మడగల మూర్తి (64) అనే ఇద్దరు వృద్ధులు రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. గత రెండేళ్ల నుంచి ఆశ్రమంలో ఉంటున్న మూర్తి పక్షవాతంతో బాధపడుతున్నారు. ఆశ్రమంలో ఉన్నప్పటికీ ఎవరో ఒకరి తోడు అనేది చాలా అవసరం. ఆ సమయంలోనే రాములమ్మ సహకారంతో మూర్తి పూర్తిగా కోలుకున్నారు. వీరిద్దరూ ఆశ్రమంలో ఒకరికొకరు తోడుగా ఉండేవారు.
ఆ సమయంలోనే ఇద్దరూ వివాహం చేసుకొని జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలని భావించారట. అనంతరం ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి స్వర్ణాంధ్ర నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు విషయాన్ని చెప్పి శుక్రవారం రోజున వివాహాన్ని చేసుకున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. కొంతమంది లేటు వయసులో వివాహం చేసుకోవడం అవసరమా అని అంటుంటే మరి కొంతమంది చాలా మంచి పని చేశారు. జీవితంలో తోడు అనేది చాలా అవసరం అంటూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.