గత నాలుగు రోజులుగా తెలుగుదేశం పార్టీ యువ నేత ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కటే మీడియా ముందుకు వచ్చి గొంతు ఎత్తుతున్నారు. పార్టీ .. ప్రభుత్వం మరింత స్ట్రాంగ్ అవ్వాలంటే కచ్చితంగా లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని వారు కోరుతున్నారు. అయితే వాస్తవంగా లోకేష్ కు ఉపముఖ్యమంత్రి పదవి చంద్రబాబు కట్టబెట్టే అవకాశాలు ఏమాత్రం లేవని తెలుగుదేశం పార్టీలో పలువురు కీలక నేతలు చెబుతున్న మాట. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కాపు కోటాలో నిమ్మకాయల చినరాజప్పకు .. బీసీ కోటాలో కేఈ కృష్ణమూర్తికి ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారు. ఇక ఈసారి కోటమి లో జనసేన ప్రాధాన్యతను గుర్తించి ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అనుకున్న చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు.
ఇప్పుడు మరో ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే ఆయన మరో అగ్ర కులం అయిన కమ్మ సామాజిక వర్గానికే చెందిన తన తనయుడు నారా లోకేష్ కు ఎంత మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు లేవని తెలుగుదేశం పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఒకవేళ లోకేష్ కు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే అప్పుడు ముఖ్యమంత్రి తో పాటు రెండు ఉపముఖ్యమంత్రి పదవులు కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే ఉంటాయి. ఒకవేళ మరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటే ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకుడు మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చం నాయుడికి ఇస్తారని తెలుస్తోంది.
ఆయన బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన టిడిపికి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలుగేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన టిడిపి అధ్యక్షుడిగా ఉండగానే ఏపీలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వచ్చింది. పైగా వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన అరెస్టయ్యారు. బిసి ప్రతినిధిగా బలమైన వాయిస్ వినిపించే అచ్చం నాయుడుకు మంత్రి పదవి అయితే దక్కింది. ఒకవేళ టీడీపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే అచ్చం నాయుడు కచ్చితంగా ఉపముఖ్యమంత్రి అయ్యేవారు అని టిడిపి వర్గాలే చెబుతున్న మాట.