వివరాల్లోకి వెళితే, కొండూరు రాజేష్ ఎక్స్ వేదికగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పేర్లను హ్యాష్‌ట్యాగ్‌లతో జతచేసి, సహాయం కోరుతూ పోస్టులు పెట్టేవాడు. దీని ద్వారా వైద్య సహాయం అవసరమైన నిరుపేదల వివరాలు సేకరించేవాడు. బాధితులను నమ్మించడానికి అమెరికాకు చెందిన నకిలీ ఫోన్ కోడ్‌తో వాట్సాప్ ఖాతాను సృష్టించాడు. తద్వారా తాను అమెరికాలో ఉంటున్నానని అందరూ నమ్మేలా వ్యవహరించేవాడు.
బాధితులతో సంభాషించే సమయంలో తాను ఎన్నారై టీడీపీ కన్వీనర్‌నని చెప్పుకునేవాడు. వైద్య సహాయం కోసం డబ్బులు పంపుతున్నట్లు నకిలీ బ్యాంకు రసీదులు కూడా పంపించి వారిని పూర్తిగా నమ్మించేవాడు. ఆ తర్వాత, ఇండియన్ ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్ చేసి బ్యాంకు మేనేజర్‌లాగా మాట్లాడేవాడు. రెమిటెన్స్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు వంటి వివిధ కారణాలు చెబుతూ తన బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వేయించుకునేవాడు.
కొండూరు రాజేష్ గతంలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. ఇతను సుమారు 54 లక్షల రూపాయలకు పైగా మోసపూరితంగా సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును సీరియస్‌గా పరిగణించిన సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం సాంకేతిక ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించింది. చివరకు నిందితుడు కొండూరు రాజేష్ అని గుర్తించి అతడిని అరెస్టు చేశారు. ఈ మోసంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.