కూటమి ప్రభుత్వం పింఛన్లపై  ఫోకస్ చేసింది. ప్రభుత్వం 14 రకాల సామాజిక పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే.  చంద్రబాబు హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే  రూ.4 వేల మొత్తాన్ని మూడు నెలల బకాయి తో పాటు చెల్లించారు.  మరోవైపు కొత్త పింఛన్ల జారీకి సంబంధించి ప్రక్రియ ప్రారంభించారు.  అయితే ఇప్పటికే అందిస్తున్న పింఛన్లలో భారీగా బోగస్ ఉన్నట్లు గుర్తించారు.


ముఖ్యంగా వికలాంగుల పింఛన్లకు సంబంధించి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి.  తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వికలాంగ పింఛన్లు పొందారు అన్నది ప్రధాన ఆరోపణ.  రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల కు సంబంధించి దివ్యాంగ పింఛన్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.  చాలామంది తప్పుడు వైకల్య ధ్రువపత్రాలు పెట్టి పింఛన్లు పొందుతున్నారన్నది ప్రధాన ఆరోపణ.  విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రయోగాత్మకంగా కొన్ని సచివాలయాల పరిధిలో తనిఖీలు చేపట్టింది.  ప్రస్తుతం తనిఖీలు జరుగుతుండడంతో బోగస్ లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.


సాధారణంగా దివ్యాంగ పింఛన్లకు సంబంధించి.. మూడు విభాగాలుగా విభజించారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ మంచానికి పరిమితమైన వారికి ప్రభుత్వం 15000 రూపాయలు కింద పింఛన్ మొత్తాన్ని అందిస్తోంది.  ప్రస్తుతం వీరిని ముగ్గురు వైద్యులతో కూడిన బృందం పరిశీలిస్తోంది.  అక్కడికక్కడే వారి ఆరోగ్య వివరాలను నమోదు చేసే ప్రక్రియ సైతం కొనసాగుతోంది.  చాలామంది అర్హత లేని వారికి సైతం 15 వేల రూపాయల చొప్పున పింఛన్ అందుతున్నట్లు గుర్తిస్తున్నారు. ఇంకోవైపు తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వారికి పదివేల రూపాయలు చొప్పున అందిస్తున్నారు. దీనిలో ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లు తాజాగా చేస్తున్న తనిఖీల్లో బయటపడుతోంది.


వైకల్యంతో బాధపడుతున్న సాధారణ మనుషులకు 6000 రూపాయలు చొప్పున పింఛన్ అందిస్తున్నారు. అయితే ఇందులో సైతం ఎక్కువమంది బోగస్ ఉన్నట్లు తెలుస్తోంది.  వీరందరికీ సమీప ప్రభుత్వ ఆసుపత్రికి  తీసుకెళ్లి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.   వీరిలో సైతం భారీగా బోగస్ లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రత్యేక నమోదు ప్రక్రియ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. 18 లక్షల వరకు ఉన్న ఈ పింఛన్లలో సగానికి సగం బోగస్ అని ప్రచారం జరుగుతోంది.  మరి ఈ తొలగింపు జాబితాలో ఎంతమంది ఉంటారో తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: