'ది బీస్ట్' అనేది చాలా స్పెషల్ కారు. ఇది ఒక నడిచే కోట లాంటిది. దీన్ని కాడిలాక్ కంపెనీ వాళ్లు తయారు చేశారు. చూడటానికి లగ్జరీ కారులా ఉన్నా, దీని బాడీ మొత్తం స్టీల్ రేకులతో చేసిన కవచం. బుల్లెట్లు దూసుకుపోలేవు, బాంబులేసినా ఏమీ కాదు. దీని అద్దాలు కూడా స్పెషల్, ఏకంగా తూటాల్నే ఆపేస్తాయి. టైర్లు పంచర్ అయినా పర్లేదు, ఆగకుండా దూసుకుపోతాయి. లోపల కూర్చుంటే మాత్రం మహారాజులా ఫీలవ్వాల్సిందే.
ఇక సెక్యూరిటీ ఫీచర్ల గురించి చెప్పాలంటే బోలెడన్ని ఉన్నాయి. ఒకవేళ బయట గాలిలో విషపూరిత రసాయనాలుంటే, లోపలికి రాకుండా కారు మొత్తం గాలి చొరబడని విధంగా సీల్ అయిపోతుంది. అంతేకాదు, ప్రెసిడెంట్ కోసం ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఉంటాయి. ఎమర్జెన్సీలో రక్తం ఎక్కించాల్సి వస్తే, ట్రంప్ బ్లడ్ గ్రూప్‌కు సరిపోయే రక్తం బ్యాగులు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే, ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోరు.
కమ్యూనికేషన్ సిస్టం కూడా ఈ కారులో ఉంటుంది. ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నా, నేరుగా వైస్ ప్రెసిడెంట్‌తో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌తో, పెంటాగన్‌తో మాట్లాడేందుకు శాటిలైట్ ఫోన్ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో క్షణాల్లో కనెక్ట్ అయిపోయేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా నైట్ విజన్ కెమెరాలు కూడా ఉన్నాయి. చీకట్లో కూడా అంతా స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాదు, అవసరమైతే ఎదుటివారిపై దాడి చేసేందుకు పంప్ యాక్షన్ షాట్‌గన్లు, టియర్ గ్యాస్ గుండ్లు లాంటి ఆయుధాలు కూడా ఈ కారులో ఉన్నాయి.
అయితే ది బీస్ట్ గురించిన పూర్తి వివరాలు మాత్రం సీక్రెట్‌గా ఉంచుతారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ వాళ్లే దీని డిజైన్, ఫీచర్లన్నీ చూసుకుంటారు. ప్రెసిడెంట్ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడరు. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో, ఆయన దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా, విదేశాలకు వెళ్లాలన్నా ఈ 'ది బీస్ట్' ఆయనకు ఒక పటిష్టమైన రక్షణ కవచంలా ఉంటుంది. మొత్తానికి ట్రంప్ మళ్లీ రావడం, ది బీస్ట్ మళ్లీ రోడ్లపై గర్జించడం, అంతా ఒక సెన్సేషనే కదా.