తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన తాత, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ నిర్వహణ సరిగా లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయమూ విధితమే.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద పైకప్పు, గోడలకు పెయింట్ ఊడిపోయి ఉండటం, తోటలో లైట్లు విరిగిపోయి ఉండటాన్ని లోకేష్ గమనించారు. దీంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే స్పందించి, తన వ్యక్తిగత డబ్బుతో మరమ్మతు పనులు చేయిస్తానని ప్రకటించారు. అవసరమైన అనుమతులు తీసుకుని వెంటనే పనులు ప్రారంభించాలని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ఘాట్ నిర్వహణను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) సరిగా చేయడం లేదని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్టీఆర్ ట్రస్ట్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని గత తెలంగాణ ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరినట్లు లోకేష్ తెలిపారు. సోషల్ మీడియాలో, టీడీపీ నేతలు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో hmda వెంటనే స్పందించింది. మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం అక్కడ ఆగమేఘాల మీద పనులు ప్రారంభమయ్యాయి.

 ఇదిలా ఉంటే మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఘాట్ నిర్వహణను చూసుకుంటామని టర్న్‌కోట్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ అధ్వాన్నంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

మొత్తానికి, నారా లోకేష్ చొరవతో ఎన్టీఆర్ ఘాట్‌కు మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధాలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా ఒక మంచి ఆలోచన లోకేష్ కి రావడం దానివల్ల ఘాటు బాగుపడుతుండడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: