తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఇప్పుడు పార్టీ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఎన్నికలకు ముందు అమరావతి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయనను.. గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోని తిరువూరుకి పంపి.. ఎమ్మెల్యే సీటు ఇచ్చి మరి గెలిపించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన రెండు నెలల నుంచి కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిపై స్థానికంగా తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన ప్రభుత్వానికి మచ్చ తెచ్చే పనులు చేస్తున్నారని.. ఆయన తీరు వల్ల తిరువూరులో పార్టీ పెద్ద ఎత్తున నష్టపోతుందన్న వార్తలు వచ్చాయి.
వీటిలో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్లు కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పటికే కొలికిపూడి కి చాలాసార్లు క్లాస్ ఇచ్చారు. తాజాగా ఆయన పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని ఆదేశించడం.. ఆయన వివరణ ఇచ్చుకోవటం జరిగాయి. కొలికిపూడిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. ఆయన తన తీరు మార్చుకుంటారని ఆశిస్తున్నట్టు టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు .. క్రమశిక్షణ సంఘం నేత వర్ల రామయ్య కూడా చెప్పారు. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందని అందరూ అనుకున్నారు.
అయితే.. కొలికిపూడి క్రమశిక్షణ సంఘం ముందు కొంతమంది పాత, కొత్త ఎమ్మెల్యేల జాబితా పెట్టి వారితో పోలిస్తే తాను చేస్తున్నది ఎలా ? తప్పు అవుతుందని ప్రశ్నించినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయం చివరకు చంద్రబాబు వరకు వెళ్లడంతో కొలికిపూడి వ్యవహారంపై తానే స్పందిస్తానని.. ఆయనను వదిలేయాలని కూడా చెప్పినట్టు టీడీపీ సీనియర్ నాయకులు గుసగుసలు ఆడుకుంటున్నారు. ప్రస్తుతం ఇసుక, మద్యం సహా.. బెదిరింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది ఎమ్మెల్యేలు జాబితాను కొలిక్కిపడి స్వయంగా బయటికి తీసి.. గతంలో వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను కూడా ప్రస్తావించడంతో క్రమశిక్షణ సంఘం వారు కూడా అవాక్కైనట్టు సమాచారం.