- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )


ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో మ‌రో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు ఏర్పాట‌య్యే ఛాన్సులు ఉన్నాయి. ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్, సిఇఓ క్యాంప్ బెల్ విల్సన్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.... రాష్ట్రంలోని ఏడు ఆపరేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా ఈ ఏడాది 52.51లక్షల ప్యాసింజర్ ట్రాఫిక్ సాధించింది. విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రాంతీయ MRO (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాల్) హబ్ ను ఏర్పాటు చేయండి. ఈ సదుపాయం కల్పించడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడమేగాక ఎయిరిండియా కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ప్రతిపాదిత హబ్ తో ఉపాధి అవకాశాలు లభిస్తాయ‌న్నారు.


అలాగే అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తుంది. విమానయానరంగంలో ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. సిఆర్ డిఎ పరిధిలో దుబాయ్ తరహాలో 3వేల నుంచి 5వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుచేయండి. ఇక్కడ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తే గ్లోబల్ యావియేషన్ లో కీలకపాత్ర వహించడమేగాక ఎపికి అంతర్జాతీయ ట్రాఫిక్, పెట్టుబడులు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో పైలట్లు/ స్టీవార్డెస్/ టెక్నికల్ టీం కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయండి.  గవర్నమెంట్ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (GATI) అంచనా ప్రకారం భారతదేశంలో రాబోయే 10 సంవత్సరాలలో 20వేలమంది పైలట్లను తయారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న పైలట్‌లకు ఉపశమనం కలిగించేలా పైలట్లను తయారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఫ్లయింగ్ స్కూల్స్ నెలకొల్పాలని మంత్రి లోకేష్ కోరారు.


ఎయిరిండియా ఎండి క్యాంప్ బెల్ విల్సన్ మాట్లాడుతూ... ఎయిరిండియా ఇప్పటికే దేశంలోని ప్రధాననగరాల్లో ఆపరేషనల్ హబ్స్ కలిగి ఉంది. మరికొన్ని ఇతర నగరాల్లో MRO (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాల్) హబ్ లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెంచడానికి ఇటీవల బెంగుళూరులో MRO ఫెసిలిటీని ప్రారంభించాం. ఎయిరిండియా ఫ్లీడ్ అప్ గ్రేడేషన్, అధునిక విమానాలను పరిచయం చేసే ప్రణాళికలు, గ్లోబల్ ఉనికిని బలోపేతం చేయడానికి మౌలిక సదుపాయాలు, సాంకేతికతపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తులపై డైరక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: