ఇటీవల పారిశుద్ధ్య కార్మికులు నేరుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా సర్పంచ్ మాటను కూడా లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు రావడంతో బాధితుల సంఖ్య పెరిగింది.
గత మూడు నెలలుగా సచివాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి, కార్యదర్శి వెంకటేశ్వరరావుకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ విషయం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దృష్టికి చేరడంతో, ఆయన కార్యదర్శిని పిలిపించి వివరణ కోరారు. అయితే, కౌన్సిలింగ్ జరుగుతుండగా కార్యదర్శి వెంకటేశ్వరరావు రహస్యంగా తన సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి చొక్కా జేబులో పెట్టుకున్నారు. అక్కడ ఉన్న ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇది గమనించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.
కౌన్సిలింగ్ అనంతరం కార్యదర్శి బయటకు వెళ్తుండగా, టీడీపీ కార్యకర్త చెప్పిన విషయం ఎమ్మెల్యేకు తెలియడంతో ఆయన వెంటనే స్పందించారు. పోరంకి, పెనమలూరుకు చెందిన టీడీపీ నాయకులు కార్యదర్శిని నిలదీసి ఫోన్ పరిశీలించగా, వీడియో రికార్డింగ్ వాస్తవమేనని తేలింది. వెంటనే ఆ రికార్డింగ్‌ను తొలగించారు. ఈ ఘటనతో ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు.
కార్యదర్శి వెంకటేశ్వరరావును మందలించడంతో పాటు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దీర్ఘకాలిక సెలవుపై పంపించారు. ఆయన స్థానంలో గతంలో ఇక్కడ పనిచేసిన కార్యదర్శి సుబ్బారావును, ఇన్ఛార్జి కార్యదర్శిగా నియమించారు. ప్రస్తుతం ఆయన ఉయ్యూరు మండలం చిన ఓగిరాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఇదేం వికృత బుద్ధి అని చాలామంది కార్యదర్శిని తిట్టిపోస్తున్నారు.