అమెరికా నుంచి ఆర్థిక సహాయం పొందే దేశాలకు ఇది నిజంగా పెద్ద దెబ్బే. అభివృద్ధి ప్రాజెక్టులు, సైనిక మద్దతు కోసం అమెరికా డబ్బులపై ఆధారపడే దేశాలు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. న్యూయార్క్ టైమ్స్ పత్రికకు లీకైన ఒక ఇంటర్నల్ మెమోలో ఈ వివరాలన్నీ ఉన్నాయి. కొత్తగా ఎలాంటి సహాయ ఒప్పందాలు కుదుర్చుకోవద్దని, ప్రస్తుతమున్న వాటిని పొడిగించవద్దని రూబియో స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపై సహాయం చేయాలా వద్దా అనే ప్రతి నిర్ణయం ట్రంప్ విదేశాంగ విధాన ప్రాధాన్యతలకు అనుగుణంగానే ఉండాలని కూడా ఆదేశించారు. ప్రస్తుతం అమెరికా విదేశీ సహాయ కార్యక్రమాలపై జరుగుతున్న సమీక్షలో భాగంగానే ఈ తాజా నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. ఉదాహరణకు, రష్యా దురాక్రమణను ఎదుర్కోవడానికి అమెరికా నుంచి భారీగా సైనిక సహాయం పొందుతున్న ఉక్రెయిన్‌కు ఈ నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బ తగలవచ్చు. గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో ఉక్రెయిన్‌కు అమెరికా అండగా నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
అయితే ఇజ్రాయెల్, ఈజిప్ట్‌లకు మాత్రం ఎలాంటి ఢోకా లేదు. ఈ రెండు దేశాలకు మిలిటరీ సాయం యథావిధిగా కొనసాగుతుంది. ఇజ్రాయెల్ చాలా కాలంగా అమెరికా ఆయుధాలు, నిధులపై ఆధారపడుతోంది. ముఖ్యంగా గాజాలో హమాస్‌తో జరిగిన యుద్ధం వంటి సమయాల్లో అమెరికా సహాయం ఇజ్రాయెల్‌కు ఎంతో కీలకంగా మారింది. 1979లో ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుండి ఈజిప్ట్ కూడా అమెరికా నుండి సైనిక సహాయం పొందుతోంది.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ట్రంప్ విదేశీ సహాయంపై 90 రోజుల పాటు తాత్కాలిక విరామం విధించారు. ఈ సహాయం తన ప్రభుత్వ లక్ష్యాలకు ఎంతవరకు మద్దతు ఇస్తుందో అంచనా వేయడమే ఆయన ముఖ్య ఉద్దేశం. రూబియో విడుదల చేసిన మెమోతో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎంత కఠినమైనదో స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు అన్ని రకాల అమెరికా సహాయానికి ఈ ఫ్రీజ్ వర్తిస్తుందని తేలిపోయింది.
అయితే ట్రంప్ తీసుకున్న ఈ చర్య చట్టబద్ధతపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విదేశీ సహాయంతో సహా సమాఖ్య బడ్జెట్‌ను కాంగ్రెస్ నియంత్రిస్తుంది. సహాయాన్ని నిలిపివేయడం వల్ల అమెరికా మిత్రదేశాలు ప్రత్యర్థి దేశాల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా అమెరికా పలుకుబడి తగ్గిపోయే అవకాశం కూడా ఉంది.