అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. చదువు కోసం లక్షలు అప్పులు చేసి మరీ అక్కడికి వెళ్లిన వాళ్లు, ఇప్పుడు ఉద్యోగాలు వదులుకుంటున్నారు. కారణం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా రావడం, కఠిన ఆంక్షలు విధించడమే.

అసలు విషయం ఏంటంటే, అమెరికాలో F-1 వీసా మీద చదువుకునే విద్యార్థులు వారానికి 20 గంటలు మాత్రమే కాలేజీ క్యాంపస్‌లో పనిచేయడానికి అనుమతి ఉంది. కానీ చాలా మంది విద్యార్థులు ఖర్చులు తట్టుకోవడానికి రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, దుకాణాల్లో కూడా పనిచేస్తుంటారు. ఇప్పుడు ట్రంప్ రావడంతో తనిఖీలు పెరుగుతాయనే భయంతో, ఆ ఉద్యోగాలను వదిలేస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయేమో అని రిస్క్ తీసుకోవడానికి ఏ ఒక్క విద్యార్థి కూడా సిద్ధంగా లేడు.

ఇల్లినాయిస్‌లో గ్రాడ్యుయేట్ చేస్తున్న అర్జున్ అనే విద్యార్థి తన బాధను చెప్పుకున్నాడు. "నేను క్లాసులు అయిపోయాక ఒక చిన్న కేఫ్‌లో పనిచేసేవాడిని. గంటకు 7 డాలర్లు ఇచ్చేవారు. రోజుకు ఆరు గంటలు పనిచేస్తే నెల ఖర్చులు గడిచేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడ పట్టుకుంటారో అని భయమేస్తోంది. అందుకే ఉద్యోగం మానేశాను. ఇప్పటికే 50 వేల డాలర్లు (సుమారు రూ.42.5 లక్షలు) అప్పు చేసి ఇక్కడకు వచ్చాను. ఇక రిస్క్ తీసుకోలేను" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

న్యూయార్క్‌లో మాస్టర్స్ చేస్తున్న నేహా అనే విద్యార్థిని కూడా ఇదే భయంతో ఉంది. "మా వర్క్‌ప్లేస్‌లలో ఎప్పుడు పడితే అప్పుడు తనిఖీలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అందుకే నా స్నేహితులు, నేను అందరం ఉద్యోగాలు మానేశాం. కష్టంగానే ఉంది కానీ, తిరిగి దేశానికి పంపించేస్తే మా పరిస్థితి ఏంటి? మా తల్లిదండ్రులు నన్ను ఇక్కడకు పంపించడానికి ఎంతో కష్టపడ్డారు" అని కన్నీళ్లు పెట్టుకుంది.

ఉద్యోగాలు లేకపోవడంతో విద్యార్థులు తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతోనో, లేదా ఇండియాలో ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యుల దగ్గర అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. కానీ ఇది ఎన్నాళ్లు సాధ్యమవుతుంది అనేదే పెద్ద ప్రశ్నార్థకం ఒక విద్యార్థిని మాట్లాడుతూ "నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. రూమ్‌మేట్ దగ్గర అప్పు తీసుకున్నాను. మళ్లీ మా తల్లిదండ్రులను డబ్బులు అడగాలంటే గుండె తరుక్కుపోతుంది. కానీ తప్పేలా లేదు" అని నిస్సహాయంగా వాపోయింది.

ఆర్థిక ఇబ్బందులతో పాటు, విద్యార్థులు మానసికంగా కూడా కుంగిపోతున్నారు. అమెరికాలో జీవితాన్ని గడపడం అంటేనే ఎంతో ఒత్తిడి. దానికి తోడు ఉద్యోగాలు పోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో తెలియక చాలా మంది విద్యార్థులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: