చమురు ధరలు మరీ ఎక్కువైనా, మరీ తక్కువైనా రష్యా, అమెరికా ఆర్థిక వ్యవస్థలు రెండూ నష్టపోతాయని పుతిన్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రాక్టికల్ పర్సన్ అని పొగుడుతూ, అమెరికా ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటారని తాను అనుకోలేనని పుతిన్ స్పష్టం చేశారు.
ఇక ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా పుతిన్ తన అభిప్రాయం వెల్లడించారు. జో బైడెన్ కాకుండా ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే, అసలు ఈ యుద్ధమే వచ్చేది కాదని పుతిన్ అన్నారు. "ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే, 2020 ఎన్నికల్లో ఆయన విజయం దొంగిలించబడి ఉండకపోతే, ఉక్రెయిన్ సంక్షోభం తప్పిపోయేది అని ట్రంప్ చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను" అని పుతిన్ వ్యాఖ్యానించారు. 2020 అమెరికా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఫలితాలను తారుమారు చేశారని ట్రంప్ చేసిన ఆరోపణలను పుతిన్ ఇక్కడ గుర్తు చేశారు.
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ట్రంప్ మాట్లాడిన తర్వాత పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చమురు ధరలు తగ్గిస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వెంటనే ఆగిపోతుందని ట్రంప్ ఆ సదస్సులో అన్నారు. అయితే, ట్రంప్ అభిప్రాయంతో క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాత్రం విభేదించారు. యుద్ధం చమురు ధరల కోసం కాదని పెస్కోవ్ తేల్చి చెప్పారు. రష్యా జాతీయ భద్రత, కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న రష్యన్ల రక్షణ, రష్యా భద్రతా సమస్యలను పరిష్కరించడానికి అమెరికా, యూరప్ నిరాకరించడం వల్లే ఈ యుద్ధం జరుగుతోందని పెస్కోవ్ స్పష్టం చేశారు.
అంతేకాదు, ట్రంప్‌తో చర్చలకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని పెస్కోవ్ తెలిపారు. అయితే, అమెరికా నుంచి సంకేతాల కోసం పుతిన్ ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. అమెరికా చర్చలకు సిద్ధంగా ఉంటే, పుతిన్ కూడా సంభాషణలకు సిద్ధంగా ఉన్నారని పెస్కోవ్ నొక్కి చెప్పారు.