ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో లుకలుకలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. టిడిపి వర్సెస్ జనసేన పార్టీ నేతల మధ్య ఈ మధ్యకాలంలో విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి మొదలుపెడితే... తిరుపతి జిల్లా వరకు అంతట వివాదాలే ఉన్నాయి. దానికి తోడు ఈ మధ్యకాలంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ను చేయాలనే డిమాండ్ కొత్తగా తెరపైకి వచ్చింది.

 

స్వయంగా టిడిపి మంత్రులు, కీలక నేతలందరూ... నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయితే... పవన్ కళ్యాణ్ కు అవమానం జరిగినట్లే. దీంతో జనసేన నాయకులు కూడా తమ స్టైల్ లో స్పందిస్తున్నారు. డిప్యూటీ సీఎం నారా లోకేష్ కు ఒకవేళ ఇస్తే... సీఎం పదవి పవన్ కళ్యాణ్ కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా జనసేన వర్సెస్ టిడిపి నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

 

ఇలాంటి నేపథ్యంలోనే కూటమి నేతల ప్రవర్తన పై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన లేఖ విడుదల చేశారు. కూటమి శ్రేణులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఎక్కడపడితే అక్కడ అనవసరమైన తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడకూడదని కోరారు. అలాగే అవివాదాలు అలాగే విభేదాల జోలికి అస్సలు వెళ్లకూడదని కూటమినేతలను రిక్వెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్.

 

తప్పుడు వార్తలపై అలాగే కూటమి అంతర్గత విషయాలపై కూడా ఎవరు స్పందించిన.. కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. తమ సొంత అభిప్రాయాలను కూటమి పార్టీ నేతలు అస్సలు చెప్పకూడదని కూడా కోరారు. అదే సమయంలో జనసేన నాయకులను కూడా... క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. అయితే నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ విపరీతంగా వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇలా స్పందించడం చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: