అయితే, ఈ ఆరోపణలను సదరు సంస్థలు వెంటనే ఖండించాయి. ఇదిలా ఉంటే, గూగుల్‌పై కూడా ఒక ఆసక్తికరమైన ఆరోపణ వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుల జాబితాను గూగుల్‌లో వెతికితే, బైడెన్ పేరు కనిపించడం లేదట. గతంలో ఒబామా, క్లింటన్ వంటి అధ్యక్షుల పేర్లు చూపిస్తూ, ఆ తర్వాత ట్రంప్ పేరును రెండుసార్లు అంటే గతంలో చేసినప్పుడు, ఇప్పుడు చేస్తున్నప్పుడు చూపిస్తోంది కానీ, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పేరు మాత్రం ఆ జాబితాలోంచి మాయం అయిందట.
దీంతో, ట్రంప్‌ను సంతృప్తి పరచడానికే ఇలాంటి పనులు జరుగుతున్నాయని కొందరు వాదిస్తున్నారు. ఈ ప్రచారం వెనుక నిజం ఎంత ఉందో తెలియదు కానీ, సంస్థలు మాత్రం దీన్ని గట్టిగా తోసిపుచ్చుతున్నాయి.
అమెరికా అధ్యక్షుల జాబితాలో బైడెన్ పేరు కనిపించకపోవడంపై గూగుల్ వెంటనే స్పందించింది. "మా నాలెడ్జ్ గ్రాఫ్‌లో డేటా ఎర్రర్ వల్ల అలా జరిగింది" అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. "సమస్య ఎక్కడ ఉందో గుర్తించి వెంటనే సరిచేశాం" అని మీడియాకు ఇచ్చిన వివరణలో గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు.
అయితే, సోషల్ మీడియాలో మాత్రం రచ్చ ఆగలేదు. కొందరు నెటిజన్లు గూగుల్ వివరణను నమ్మడం లేదు. ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద టెక్ సంస్థలు ఇలాంటి వ్యూహాలు పన్నుతున్నాయని ఆరోపిస్తున్నారు. "ఇది నిజమైతే, ఇంటర్నెట్ చరిత్రలోనే ఇది ప్రమాదకరమైన చర్య అవుతుంది. వ్యతిరేకించే వారిని పూర్తిగా లేకుండా చేసే ప్రయత్నం ఇది" అని ఒక యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు.
మరో యూజర్ "గూగుల్‌లో అమెరికా అధ్యక్షులు అని కొడితే బైడెన్ పేరు లేదు. ఇది మామూలు విషయం కాదు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఒక అధ్యక్ష పదవిని తుడిచిపెట్టేయడానికి గూగుల్‌కు ఎవరు డబ్బులిచ్చారు?" అని ఇంకొకరు నిలదీశారు. ఇంతకుముందు గూగుల్ ట్రంప్ ప్రారంభోత్సవ నిధికి 1 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చిందన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. సుందర్ పిచాయ్ ట్రంప్ ప్రమాణ స్వీకార వేడుకలో ప్రముఖ స్థానంలో కనిపించడం కూడా ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అసలు ఏం జరుగుతోంది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.