అందరు ఊహించినట్టే ట్రంప్ 2.O సర్కార్ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మొదటి పాలనలోనే ఇస్లామాబాద్ భరతం పట్టిన ట్రంప్.. నేడు కూడా అదే చేయబోతున్నట్టు తన చర్యలతో మరోమారు రుజువు చేసుకున్నాడు. ఫస్ట్ టర్మ్‌లో పాక్‌కు అందించే సైనిక సాయాన్ని నిలిపివేసిన ట్రంప్.. ఇప్పుడు పౌర సహాయాన్ని కూడా అందించేది లేదని తెగేసి చెప్పడంతో పాక్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తొలిరోజే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసినా ఇటీవలే ఆ పూర్తి సమాచారం బయటకు రావడం గమనార్హం.

అవును, తాజాగా డోనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ చేపడుతోన్న ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు అందించే సహాయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశాడు. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న ఇస్లామాబాద్‌ను ట్రంప్ నిర్ణయాలు మరింత పాతా ళానికి తొక్కేయడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు. కాగా సుమారు 2 దశాబ్దాలుగా అమెరికా తన తెలివి తక్కువతనంతో పాకిస్తాన్‌కు దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆర్ధిక సాయం అందించింది. మనం వేటాడుతున్న ఉగ్రవాదులకు తమదేశంలో ఆశ్రయం కూడా కల్పిస్తోంది. అయితే ఆ పరిస్థితులకు ఇప్పుడు పూర్తిగా అడ్డుకట్ట పడబోతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది.

ఎందుకంటే, డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీతో అమెరికా చాలా మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. ట్రంప్ తొలి పాలనలోనే పాకిస్థాన్ దేశానికి చుక్కలు చూపించారు. 2016 ఆర్థిక సంవత్సరానికి గానూ పాకిస్తాన్‌కు ఇవ్వ దలచిన 17 వందల కోట్ల నిధులను ట్రంప్ అప్పట్లో ఆపివేశారు. తామిస్తున్న నిధులు పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరుకి కాక.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి వాడుతోందని ఆనాడు ట్రంప్ సర్కార్ అంతర్జాతీయ సమాజం ముందే కడిగిపారేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తమకు తోడ్పాటు అందిస్తున్నందుకు అమెరికా ఇస్లామాబాద్‌కు 4వేల 600 కోట్లు కేటాయించింది. కానీ, ఆ నిధులకు, ఉగ్రసంస్థ లష్కరేపై చర్యలకు ముడిపెట్టింది. ఇటువంటి మరిన్ని పరిణామాలను బాగా గమనించిన ట్రంప్ అధికారంలోకి వచ్చిననాటినుండి పాకిస్థాన్ ని లైట్ తీసుకోవడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ట్రంప్ పౌర సహాయాన్ని నిలిపివేశారు. కాగా పౌర సహాయాన్ని నిలిపేసిన దేశాల జాబితాలో మొదటిది పాకిస్తాన్ కావడం కొసమెరుపు. అంటే ట్రంప్ పవర్‌లో ఉన్నంత కాలం పాకిస్తాన్‌కు నయా పైసా కూడా అమెరికా నుంచి అందదనేది నిర్వివాదాంశం. అమెరికా హ్యాండ్ ఇవ్వడం అంటే పాకిస్తాన్ కథ ముగియడమే అనేది విశ్లేషకుల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: