"వికసిత భారత్‌" లక్ష్యంగా ముందుకి దూసుకుపోతున్న ఎన్డీయే ప్రభుత్వం.. పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, ఆహార భద్రత, సామాజిక సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే గ్రామీణ ఉపాధి హామీ పథకం మొదలుకొని ఆయుష్మాన్‌ భారత్‌, పీఎం కిసాన్‌, జల్‌ జీవన్‌ మిషన్‌, పీఎం ఆవాస్‌ యోజన వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. ఇక తాజా బడ్జెట్‌ నేపథ్యంలో వీటికి కొత్తగా మరేమైనా జోడిస్తారా లేదంటే వీటినే కొనసాగిస్తారా అనే అంశంపై ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకసారి ఇక్కడ మోదీ ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోన్న కొన్ని కార్యక్రమాలను పరిశీలిద్దాము.

ముందుగా "పీఎం సూర్య ఘర్ ముఫ్త్‌ బిజ్లీ యోజన"ను పరిశీలిస్తే.. సౌర విద్యుత్తును ప్రోత్సహించే క్రమంలో కేంద్రం.. ఈ పధకాన్ని తీసుకొచ్చింది. పైకప్పులపై సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే ఈ పథకం ద్వారా ఒక్కో ఇంటిపై గరిష్ఠంగా 3 కిలోవాట్లకు రూ.78 వేల చొప్పున రాయితీ పొందే వీలుంది. కాగా ఇప్పటి వరకు 6.34 లక్షల ఇన్‌స్టాలేషన్లు పూర్తయ్యాయి అని వినికిడి.

ఇక "ఆయుష్మాన్‌కు ఆయువు" విషయానికొస్తే, దేశంలోని దాదాపు 12కోట్ల మంది పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించే లక్ష్యంతో 2018లో పీఎం-జేఏవై (ప్రధానమంత్రి జనారోగ్య యోజన) పథకం స్టార్ట్ అయింది. దేశ వ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఈ ఆరోగ్య బీమా పథకం విస్తరించడంతో తాజా బడ్జెట్‌లో మరిన్ని కేటాయింపులు పెరిగే అవకాశం లేకపోలేదు.

"పీఎం ఆవాస్‌ యోజన" గురించి తెలిసిందే. గ్రామీణ పేద ప్రజల సొంతింటి కలే ధ్యేయంగా పీఎంఏవై-రూరల్‌ (పీఎం ఆవాస్‌ యోజన) పథకం ద్వారా దాదాపు 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది. తాజా బడ్జెట్‌లో ఏ మేరకు కేటాయింపులు ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.

"గరీబ్‌ కల్యాణ్‌ యోజన" పధకం విషయానికొస్తే... కొవిడ్‌ సమయంలో పేద ప్రజలకు ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు మార్చి 2020లో ‘గరీబ్‌ కల్యాణ్‌ యోజన’ను ప్రవేశ పెట్టగా అది నేటికీ కొనసాగుతుండడం హర్షణీయం. దీని ద్వారా 81.35 కోట్ల మంది పేదలు లబ్ధిపొందుతున్నారు.

ఇక "ముద్రా యోజన" విషయానికొస్తే... వ్యవసాయేతర చిన్న, కార్పొరేట్‌ యేతర, మధ్య స్థాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం సులువైన, హామీలేని రుణాలను అందించేందుకు ప్రధాన్‌ మంత్రి ముద్రా యోజన (PMMY) 2015 ఏప్రిల్‌ 8న తీసుకురావడం జరిగింది.

ఇక "పీఎం కిసాన్‌" గురించి అందరికీ తెలిసిందే. దేశంలోని భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు 2018లో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ఏడాదికి రూ.6వేలను 3 విడతల్లో అందిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా రూ.2.5లక్షల కోట్లను లబ్ధిదారులకు అందించినట్లు కేంద్రం చెబుతోంది. ఇక తాజా బడ్జెట్‌లో ఈ ఆర్థిక సాయాన్ని పెంచుతారా? లేదా ఈ మొత్తాన్నే కొనసాగిస్తారా? అన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: