పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగం ఆంధ్రప్రదేశ్‌కు పండగలాంటి కబురు తెచ్చింది. 2025-26 బడ్జెట్‌లో ఏపీకి నిధుల వరద పారించారు. పోలవరం ప్రాజెక్టు మొదలుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు కీలక ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించడంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

• నిధుల కేటాయింపులు వివరాలు

• పోలవరం ప్రాజెక్టు: కేంద్రం పోలవరంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఏకంగా రూ.5,936 కోట్లు ప్రాజెక్టు కోసం కేటాయించగా, నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా మరో రూ.12,157 కోట్లు భారీగా ఇచ్చింది. అంటే పోలవరం కల త్వరలోనే నెరవేరబోతోంది. అంతేకాదు, ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు పెంచుతూ, 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వకు ఆమోదం తెలపడం విశేషం.

విశాఖ స్టీల్ ప్లాంట్: విశాఖ ఉక్కు కర్మాగారం ఊపిరి పీల్చుకునేలా కేంద్రం భారీగా నిధులు ఇచ్చింది. రూ.3,295 కోట్లు కేటాయించడంతో ప్లాంట్ భవిష్యత్తుపై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి.

విశాఖ పోర్టు: విశాఖ పోర్టుకు కూడా బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. రూ.730 కోట్లు నిధులు కేటాయించడంతో పోర్టు మరింత అభివృద్ధి చెందనుంది.

ఆరోగ్య వ్యవస్థలు: రాష్ట్రంలో ఆరోగ్య రంగం బలోపేతం కోసం రూ.162 కోట్లు ఇచ్చారు.

జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రూ.186 కోట్లు కేటాయించారు.

లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్: విద్యా రంగంలో మార్పుల కోసం రూ.375 కోట్లు ఇచ్చారు.

రోడ్లు, వంతెనలు: రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ. 240 కోట్లు కేటాయించారు.

ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్ట్: ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండో దశ కోసం రూ.242.50 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

ఈ బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా చంద్రబాబు మార్క్ బడ్జెట్ అని చెప్పడం విశేషం. గత ఏడు నెలలుగా చంద్రబాబు రాష్ట్ర సమస్యలపై కేంద్రానికి విన్నవించారని, వాటి ఫలితమే ఈ కేటాయింపులని ఆయన అన్నారు. జల జీవన్ మిషన్ పొడిగింపు, మాన్యుఫాక్చరింగ్ రంగానికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవడం, ఉడాన్ స్కీం ద్వారా లబ్ధి చేకూర్చడం వంటివి చంద్రబాబు కృషి ఫలితంగానే జరిగాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

మరో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సైతం బడ్జెట్‌ను స్వాగతించారు. గత ఏడు నెలల్లోనే అమరావతికి రూ.15 వేల కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.16 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరానికి రూ.12 వేల కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో రైతులు, ఆక్వా రైతులు ఎక్కువగా ఉన్నారని, వారికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్నారని ఆయన కొనియాడారు.

కేంద్ర బడ్జెట్ 2025ను సీఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. మధ్య తరగతి, వేతన జీవులకు పన్ను మినహాయింపు ఇవ్వడం గొప్ప విషయమని, ఇది మోదీ వికసిత్ భారత్ దార్శనికతకు నిదర్శనమని ఆయన ప్రశంసించారు. నిర్మలమ్మ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజానుకూలమైనదని, మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని చంద్రబాబు కొనియాడారు.

రామ్మోహన్ నాయుడు బడ్జెట్‌లోని ఆదాయపు పన్ను మినహాయింపు నిర్ణయాన్ని చారిత్రాత్మకమని అభివర్ణించారు. మధ్య తరగతి ప్రజలకు ఇది గొప్ప ఊరటనిస్తుందన్నారు. అంతేకాదు, నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగం గురజాడ అప్పారావు మాటలతో ప్రారంభించడం తెలుగువారందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: