విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పై నందిగామ టీడీపీ లేడీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన పంతం నెగ్గించుకున్నారు. చివరకు తాను అనుకున్న అభ్యర్థినే నందిగామ మునిసిపల్ చైర్‌పర్సన్ చేయడం లో ఆమె పై చేయి సాధించినట్లయ్యింది. అసలు విషయం లోకి వెళితే నందిగామ మునిసిపల్ చైర్‌పర్సన్ మండవ వరలక్ష్మి మృతి తో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఈ క్రమం లోనే వైసీపీకి చెందిన కొందరు కౌన్సెలర్లు టీడీపీ వైపు మొగ్గు చూపారు. దీంతో టీడీపీకి అధికార పీఠం కైవసం చేసుకునే అవకాశం దక్కింది.
ఈ క్రమం లో నే ఎంపీ కేశినేని చిన్ని తాను అనుకున్న 8వ వార్డు సభ్యురాలు శాఖమూరి స్వర్ణలతో పేరుతో బీ ఫామ్ ఇప్పించారు. ఇందులో స్వర్ణలత పేరు చూసిన ఎమ్మెల్యే సౌమ్య తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట. తాను చెప్పిన పేరుతోనే బీ ఫామ్ ఇవ్వాలని.. వేరెవ్వరో వేరే పేరు చెపితే కుదరదని ఆమె ఖరాఖండీగా తేల్చి చెప్పారట. సౌమ్య తో మాట్లాడేందుకు టీడీపీ అధిష్టానం పెద్దలు ఫోన్లో ప్రయత్నాలు చేసినా కూడా ఆమె వాల్ల కాల్స్ కు స్పందించలేదట. తన నియోజకవర్గ కేంద్రమైన నందిగామ మునిసిపల్ చైర్ పర్సన్ గా ఎవరు ఉండాలో తానే నిర్ణయిస్తానని .. ఈ విషయం లో తాను ఎవ్వరి మాట విననని తేల్చి చెప్పారు.
చివరకు మంత్రి నారాయణ కూడా చేసేదేం లేక ఎమ్మెల్యే సౌమ్య నిర్ణయానికే వదిలేశారు. ఎంపీ కేశినేని చిన్ని ప్రతిపాదించిన శాఖమూరి స్వర్ణలత కు బదులు తాను ప్రతిపాదించిన మండవ కృష్ణ కుమారి ని సౌమ్య మునిసిపల్ చైర్ పర్సన్ గా గెలిపించుకున్నారు. అలా సొంత పార్టీ కి చెందినే ఎంపీ చిన్ని పై ఎమ్మెల్యే సౌమ్య పై చేయి సాధించడం ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.