ఇది గుండెపోటుకు దారి తీస్తుంది, క్యాన్సర్ కారకంగా మారుతుంది అని తెలిసినా, చాలా మంది ఇంకా అదే పద్ధతిలో వంట నూనె వాడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచింది. దేశవ్యాప్తంగా వంట నూనెల వినియోగంపై ఒక సంచలన సర్వే మొదలుపెట్టింది. మీరు ఇంట్లో వంట నూనెను మళ్లీ మళ్లీ వాడుతున్నారా, డీప్ ఫ్రై అంటే బాగా నూనెలో ముంచి వేయించిన ఆహారం మీకు ఇష్టమా, అధికంగా నూనె వాడటం ఆరోగ్యానికి చేటు చేస్తుందని మీకు తెలుసా? ఇలాంటి ప్రశ్నలతో కేంద్రం మిమ్మల్ని నిలదీస్తోంది.
దేశంలో వంట నూనెల వినియోగం పెరిగిపోతోంది. నూనెల కొరత ఒకవైపు, ప్రజల ఆరోగ్యం మరోవైపు. ఈ నేపథ్యంలో కేంద్ర గణాంక శాఖ రంగంలోకి దిగింది. ఒక వెబ్‌సైట్ పెట్టి మరీ ప్రజల నుంచి సమాచారం రాబడుతోంది. ఏకంగా 24 ప్రశ్నలతో మీ వంట నూనె అలవాట్లపై ఆరా తీస్తోంది.
ఈ సర్వే మామూలుది కాదు. దేశ చరిత్రలోనే ఇలాంటి సర్వే చేయడం ఇదే మొదటిసారి. రోడ్ల మీద, హోటళ్లలో వంట నూనెను మళ్లీ మళ్లీ మరగబెట్టి వాడుతున్నారని ఆహార నాణ్యత అధికారులు స్వయంగా గుర్తించారు. గంటల తరబడి నూనెను వేడి చేయడం, ఒకసారి వాడిన నూనెనే మళ్లీ వాడటం ఎంత ప్రమాదకరమో నిపుణులు పదే పదే చెబుతున్నారు.
ప్రజలకు దీనిపై ఎంత అవగాహన ఉంది? ఎంతమంది ఈ తప్పు చేస్తున్నారు? అనే విషయాలు తెలుసుకోవడానికి కేంద్రం ఈ సర్వేను ఒక ఆయుధంలా వాడబోతోంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటే, ఈ నెల 23వ తేదీ వరకు సమయం ఉంది. భారత గణాంక శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ సమాధానాలు చెప్పేయండి. ప్రభుత్వం మీ సమాచారం కోసం ఎదురుచూస్తోంది.