పవర్ స్టార్, జనసేన నాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పాండిలైటిస్ గురించి చాలామంది తెలుసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. స్పాండిలైటిస్‌ను తెలుగులో మెడ నొప్పి అని కూడా అంటారు. ఇది కేవలం మెడ నొప్పి మాత్రమే కాదు, అనేక ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. తీవ్రమైన మెడ నొప్పితో పాటు, తల తిరగడం, కళ్లు తిరగడం, శరీరం బ్యాలెన్స్ తప్పుతున్నట్లు అనిపించడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా, కొంతమందిలో మానసిక ఆందోళన, నిరుత్సాహం, ప్రయాణం చేయాలంటేనే భయం వంటి మానసిక సమస్యలు కూడా స్పాండిలైటిస్‌తో ముడిపడి ఉండవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నేటి జీవనశైలిలో స్పాండిలైటిస్ ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఇది స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా ఎవరికైనా రావచ్చు. మన వెన్నెముక నిర్మాణం అనేక వెన్నుపూసలతో రూపొందించబడి ఉంటుంది. వాటి మధ్య డిస్కులు ఉంటాయి. స్పాండిలైటిస్ వచ్చినప్పుడు, ఈ డిస్కులు వాటి సహజ స్థానాన్ని కోల్పోతాయి. డిస్కుల మధ్య ఖాళీ తగ్గిపోతుంది. ఫలితంగా, వెన్నుపూసల మధ్య ఉండే మృదులాస్థి (కార్టిలేజ్), నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది తీవ్రమైన నొప్పికి కారణమవుతుంది. ముఖ్యంగా మెడ నొప్పి ఎక్కువగా ఉంటుంది. అధిక ఒత్తిడి డిస్కులపై పడినప్పుడు మెడ, భుజాలు బిగుసుకుపోతాయి. సరైన భంగిమలో కూర్చోకపోవడం, ఎక్కువసేపు నిలబడటం లేదా కూర్చోవడం వల్ల డిస్కులలో మార్పులు వస్తాయి.
స్పాండిలైటిస్ ఎక్కువగా కంప్యూటర్ ఉద్యోగులు, కాల్ సెంటర్లలో పనిచేసేవారు, ఎక్కువ దూరం ద్విచక్ర వాహనాలు నడిపేవారు, బరువులు ఎత్తేవారిలో కనిపిస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను తీవ్రం కాకుండా నివారించవచ్చు. మెడకు సంబంధించిన వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. మెడపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. తల తిరుగుతున్నప్పుడు ఒంటరిగా ప్రయాణాలు చేయకూడదు. ఆహారంలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు ఉండేలా శ్రద్ధ వహించాలి. అవిసె గింజలు, చేపలు, తాజా పండ్లు, ఆకుకూరలు, పాలు, పెరుగు, చీజ్, సోయా ఉత్పత్తులు, మిల్ మేకర్ వంటివి తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మద్యపానం అలవాటు ఉన్నవారు వెంటనే మానుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. సరైన జీవనశైలి మార్పులతో స్పాండిలైటిస్‌ను నివారించవచ్చు, ఉపశమనం పొందవచ్చు.