దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు సమీపిస్తున్నాయి. ఈ నెల 8న ఓట్ల లెక్కింపుతో ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగియనుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా 4వ సారి ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలుపుకోవాలని భావిస్తుంటే, 3 దశాబ్దాలుగా ఢిల్లీలో అధికారానికి దూరమైన బీజేపీ.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వయత్నం చేస్తోంది. ఇండియా కూటమిలోనే ఉన్న కాంగ్రెస్ మాత్రం ఆప్‌ను కాదని ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి విదితమే.

అయితే, ఈ సారి అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్యే ఉంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఆ సర్వేలను నమ్మకుండా.. విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేయగా, 70 శాతం సర్వేలు ఇపుడు ఢిల్లీ పీఠం ఖచ్చితంగా బిజెపిదేనని నొక్కివక్కాణించి చెబుతున్నాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో సర్వేలు బిజెపిదే గెలుపు అని చెప్పడంతో బిజెపి వర్గాలు సంబరాల్లో మునిగి తేలాయి. ఢిల్లీలో గెలుపు రాబోయే పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఉత్సాహాన్ని నింపుతుందని అప్పుడే ఓ అంచనాకి వచ్చినట్టు కనబడుతోంది.

ఈ క్రమంలోనే బిజెపి ఢిల్లీ గద్దెపైన ఎవరిని కూర్చో పెడుతుంది అనే అంశంపై చాలామంది ఆరా తీస్తున్నట్టు కనబడుతోంది. గతంలో బిజెపి తరుపున సుష్మ స్వరాజ్ ఢిల్లీలో సీఎంగా పని చేయడం జరిగింది. ఈసారి ఢిల్లీలో బిజెపి గెలుపొందినట్లైతే సుష్మ స్వరాజ్ కూతురు అయినటువంటి "బాన్సురి స్వరాజ్"ని సీఎం చేసి అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే ఢిల్లీ ఎన్నికల్లో 3 నియోజకవర్గాల ఫలితాలపై భారీగా బెట్టింగ్స్ నడుస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా రెండు పార్టీలు అయినటువంటి ఆప్ బిజెపి ప్రకటించిన ఉచిత పథకాలు ఢిల్లీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత బస్సు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, వృద్ధులకు పెన్షన్లు, ఉచిత వైద్య సేవలు.. ఇలా విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ఏ వర్గాన్నీ వదలకుండా ఉచితాలను ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పటి వరకు చేసిన ప్రచారం, ప్రకటించిన హామీలతో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో ఈ నెల 8న తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: