దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ అధికారం కోసం ఎన్నో పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. 1952లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 48 స్థానాల్లో ఏకంగా 39 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ తర్వాత ఢిల్లీ రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి.

సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఎన్నికల నగారా మోగింది. 1993లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈసారి మాత్రం ఎవరు ఊహించనది జరిగింది. భారతీయ జనతా పార్టీ సంచలన విజయం సాధించింది. 70 స్థానాలకు గాను 49 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఇది గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

అయితే, రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. 1998, 2003, 2008 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించింది. ఈ మూడు ఎన్నికల్లోనూ 50కి పైగా స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ పీఠంపై మళ్లీ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది.

ఇక 2013 ఎన్నికలు.. ఢిల్లీ రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలికాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయం సాధించింది. తొలిసారి బరిలోకి దిగిన ఆప్ ఏకంగా 28 స్థానాల్లో గెలుపొంది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు.

2015 ఎన్నికల్లో ఆప్ తన సత్తా చాటింది. ఢిల్లీ ఓటర్లు ఆప్ వైపు మొగ్గు చూపారు. 70 స్థానాల్లో 67 స్థానాల్లో ఆప్ గెలుపొంది రికార్డు సృష్టించింది. కాంగ్రెస్, బీజేపీలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. 2020 ఎన్నికల్లో కూడా ఆప్ తన హవాను కొనసాగించింది. 62 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది.

ఇప్పుడు అందరి దృష్టి 2025 ఎన్నికలపైనే ఉంది. ఢిల్లీ రాజకీయాలు మళ్లీ ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. ఆప్ తన పట్టును నిలుపుకుంటుందా? లేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పుంజుకుంటాయా? ఢిల్లీ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెళ్లడయ్యే దాకా ఆగాల్సిందే. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇప్పటినుంచే తమ అంచనాలతో హడావుడి చేస్తున్నారు. బీజేపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఆల్రెడీ అదే దిశగా బీజేపీ చాలా స్థానాల్లో ముందంజలో ఉంది. ఆ పార్టీ మాత్రమే బాగా వెనుకబడింది. ఈసారి బీజేపీ గెలిచేలాగానే ఉంది. ఢిల్లీ రాజకీయం రసవత్తరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: