శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏకంగా 43 సీట్లు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 36 దాటేసి, తిరుగులేని మెజారిటీతో దూసుకుపోయింది. మరో 5 స్థానాల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. అంటే మొత్తం 48 సీట్లు బీజేపీ ఖాతాలో పడటం ఖాయం. ఈ భారీ విజయం ఢిల్లీలో బీజేపీకి ఎంత బలమైన మద్దతు ఉందో చెప్పకనే చెబుతోంది. ఇక గత మూడు ఎన్నికల్లో దుమ్మురేపిన ఆప్ ఈసారి మాత్రం తేలిపోయింది.
కేవలం 19 సీట్లు గెలుచుకుని, మరో 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అంటే ఆప్ గరిష్టంగా 22 సీట్లకే పరిమితం కానుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దారుణం. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది, కనీసం లీడ్ లో కూడా లేదు.
• కీలక నేతలు.. గెలుపోటములు
ఆప్ ముఖ్య నేతలు చాలా మంది ఓడిపోయారు. స్వయంగా అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓటమి పాలయ్యారు. ప్రముఖుల ఫలితాలు ఇక్కడ చూద్దాం.
అరవింద్ కేజ్రీవాల్: ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అయిన కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయనను 4,089 ఓట్ల తేడాతో ఓడించారు.
సందీప్ దీక్షిత్: మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడైన సందీప్ దీక్షిత్ కూడా న్యూఢిల్లీ నుంచి పోటీ చేసి కేవలం 4,568 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు.
మనీష్ సిసోడియా: మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జంగ్పురాలో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ స్వల్ప తేడాతో, అంటే 675 ఓట్ల తేడాతో గెలుపొందారు.
అతిషి: ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి మాత్రం గెలిచారు. ఆమె కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొదట్లో వెనకబడ్డప్పటికీ, చివరి రౌండ్లలో పుంజుకుని బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిని 3,521 ఓట్ల తేడాతో ఓడించారు.
సత్యేంద్ర జైన్: సీనియర్ ఆప్ నేత సత్యేంద్ర జైన్ షాకుర్ బస్తీలో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి కర్నల్ సింగ్ భారీ మెజారిటీతో, ఏకంగా 20,998 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
సౌరభ్ భరద్వాజ్: మరో ఆప్ ముఖ్య నేత సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్ లో ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ 3,188 ఓట్ల తేడాతో గెలుపొందారు.
కైలాష్ గెహ్లోత్: బీజేపీ నేత కైలాష్ గెహ్లోత్ బిజ్వాసన్ నుంచి గెలుపొందారు. ఆయన ఆప్ అభ్యర్థి సురేందర్ భరద్వాజ్ ను 9,833 ఓట్ల తేడాతో ఓడించారు.
అర్విందర్ సింగ్: బీజేపీ నేత అర్విందర్ సింగ్ గాంధీ నగర్ లో 12,748 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
మొత్తానికి ఈ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం. బీజేపీ గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వగా, ఆప్ మాత్రం కోలుకోలేని దెబ్బతింది.