డాలర్ల కలను నెరవేర్చుకోవడానికి అంగట్లో సరుకులా సొంతగడ్డను వదిలి అమెరికా బాట పట్టిన యువతకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా నుంచి ట్రంప్ సర్కార్ గెంటేస్తోందేమో అనే భయంతో కొందరు యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో సాయికుమార్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన సాయికుమార్, తనని డిపోర్టు చేస్తారేమోనని భయంతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది.

ట్రంప్ హయాంలో మొదలైన కఠిన నిబంధనలు, డీపోర్టేషన్ భయాలు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. అక్రమ వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ ఊపందుకోవడంతో, అక్కడ చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న ఎంతో మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పైకి మాత్రం డాలర్లు సంపాదిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా, లోలోపల మాత్రం భయంకరమైన ఒత్తిడితో కుమిలిపోతున్నారు.

పిజ్జా సెంటర్లలో పనిచేస్తూ, గ్యాస్ స్టేషన్లలో కష్టపడుతూ బతికే వాళ్లు ఇండియాకి రావాలంటేనే భయపడటం విశేషం. కొందరు యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం నిజంగా దిగ్భ్రాంతికరం. ఇక్కడ స్విగ్గీలోనో, ఓలాలోనో పనిచేసుకుంటే వచ్చే ఆదాయం అక్కడ పిజ్జా డెలివరీ చేస్తే రావడం లేదు. కనీసం కంటినిండా నిద్ర, కుటుంబంతో సంతోషంగా గడిపే సమయం కూడా ఉండటం లేదు.

ఇండియాలో అవకాశాలు లేవా? బోలెడన్ని ఉన్నాయి. ఇక్కడ కూడా గౌరవంగా బతకొచ్చు. స్నేహితులు ఏమనుకుంటారో, బంధువులు చులకనగా చూస్తారేమో అని అనవసరంగా భయపడకండి. అమెరికాలో కష్టపడినా చులకనే, ఇక్కడ కష్టపడినా చులకనే అనుకుంటే.. సొంతగడ్డపై ఎందుకు కష్టపడకూడదు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది ఇలాంటి రోజులు చూడటానికా? వాళ్ల కష్టానికి ఇదేనా ఫలితం? మీరు అమెరికా వెళ్లినా, మరే దేశం వెళ్లినా చివరికి వాళ్లకు తోడుగా ఉండాల్సింది మీరేనని గుర్తు చేస్తున్నారు. చేతకానితనం అని కాదు, పరిస్థితులు అనుకూలించకపోతే వెనక్కి రావడం తప్పు కాదు. ఆత్మహత్యలు చేసుకోవడం పిరికితనం. ఇక్కడ యూఎస్ లో ఉంటున్న ఇండియన్ కోసం ఎన్నో అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. బతకడానికి బోలెడు మార్గాలున్నాయి, కానీ ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: