![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ycp847396e5-d5b2-48ca-b55f-0ad107fc2df7-415x250.jpg)
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలలో చిలకలూరిపేట నియోజకవర్గం ఒకటి. చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాల్లోకి మాజీ మంత్రి విడుదల రజిని ఎప్పుడు అయితే ఎంటర్ అయ్యారో అప్పటినుంచి ఇక్కడ రాజకీయాలు మంచి కాక మీద ఉంటున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత విడుదల ఫ్యామిలీ చిలకలూరిపేట నియోజకవర్గ రాజకీయాలలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే రజనీ మామ విడుదల లక్ష్మీనారాయణ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిలకలూరిపేట ఏఎంసీ చైర్మన్ అయ్యారు. 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు విడుదల రజనీ కుటుంబం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసిపి కండువా కప్పుకుని చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా రజిని ఎంటర్ అయ్యారు. 2019 ఎన్నికలలో రజిని తన రాజకీయ గురువు అయిన మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావుపై పోటీ చేసి సంచలన విజయం సాధించారు.
ఆ తర్వాత రజని జగన్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కూడా అయ్యారు. అక్కడ నుంచి చిలకలూరిపేట నియోజకవర్గం రాజకీయాలలో రజనీ కుటుంబం హవా నడిచింది. గత ఎన్నికలకు ముందు జగన్ రజిని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. ఆ ఎన్నికలలో ఆమె గల్లా మాధవి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం జగన్ రజినీ ని తిరిగి చిలకలూరిపేట వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. ఇప్పుడు చిలకలూరిపేట ఎమ్మెల్యేగా టిడిపి నుంచి ప్రతిపాటి పుల్లారావు ఉన్నారు. ఇద్దరు మాజీమంత్రి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రస్తుతం చిలకలూరిపేట రాజకీయం మంచి కాక మీద రేగుతుంది. రజిని తాను వడ్డీతో సహా తీర్చేస్తానని .. తమ పార్టీ వాళ్లను ఇబ్బంది పెట్టే ఎవరిని వదలబోనని చెబుతుంటే ప్రతిపాటి పుల్లారావు కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా చిలకలూరిపేట నియోజకవర్గ రాజకీయం ఇద్దరు మాజీ మంత్రుల సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కింది.