![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/kezriwal5dca1ce7-c116-499e-a5f2-a81104baaabc-415x250.jpg)
దేశ రాజకీయాల్లో 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సంచలనంగా దూసుకొచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఈ పార్టీ ఏడాది తిరగకుండానే అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడు ఆప్ పరిస్థితి ఉవ్వెత్తున ఎగిసి చతికిలపడిన చందంగా మారింది. ఏ అవినీతిని అయితే ఒక ఆయుధంగా మార్చుకుని జనాల మనసు చూరగొని ఆప్ పార్టీని పెట్టి ఏకంగా పదేళ్ళకు పైగా అధికారం చలాయించారో అదే అవినీతి ఆరోపణల విషయంలో జనాల ఆగ్రహానికి గురి అయి భారీ ఓటమిని చవిచూడడం విశేషం.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. శీష్ మహల్ భవంతిని నిర్మించుకున్నారని అది విలావంతమైనదని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు జనాలు నమ్మారు. లిక్కర్ స్కాం విషయంలో కూడా నిజముందని అనుకున్నారు. అందుకే ఈ ఫలితాలు వచ్చారు. ఇక కేజ్రీవాల్ అవినీతి చేయలేదని ఆప్ నేతలు ఎంత చెప్పినా ప్రజలు నమ్మలేదు. దీనికి తోడు అన్నా హజారే సైతం కేజ్రీవాల్ ని తప్పుపట్టడంతో అది జనంలోకి బలంగా పాతుకుని పోయింది.
ఇక అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళి వచ్చిన తరువాత తన సీఎం పదవిని రాజీనామా చేసి అతిషీని కొత్త సీఎం చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపడతానని ప్రకటించారు. కానీ ఆయన ఏకంగా ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఆప్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద సిట్ ని వేస్తామని చెబుతోంది. ఇవన్నీ చూస్తూంటే కేజ్రీవాల్ ని కేసుల ఉచ్చులోలోకి దించుతారేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆప్ శాసనసభ పక్ష నేతగా మాజీ సీఎం అతిషీనే ఉంటారని అంటున్నారు. బీజేపీకి టార్గెట్ కాబట్టి పార్టీ నిలబడాలీ అంటే కనుక కచ్చితంగా సమర్ధుడైన మరో నాయకుడికి పగ్గాలు అప్పగిస్తారా అన్నది కూడా చర్చగా సాగుతోంది. ఓటమి తరువాత కేజ్రీవాల్ తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సేవ చేసేందుకే అని గతాన్ని గుర్తు చేసుకుని కాస్త భావోద్వేగానికి గురి అయ్యారు. ఒక వేళ కేజ్రీవాల్ సంచలనమైన నిర్ణయం తీసుకుంటే కనుక ఆప్ నాయకత్వం బాధ్యతలు కూడా అతిషీకే వెళ్తాయా అన్న చర్చ జోరుగా సాగుతోంది.