![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/jagan790510c0-2ac5-4a47-ab7a-1781145e7aea-415x250.jpg)
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కొట్టిపారేశారు. రూల్స్ ప్రకారం 18 సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని, వైసీపీకి ఆ సంఖ్య లేదని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు, సీఎం హోదాలో ఉన్న వ్యక్తితో సమానంగా తనకు అవకాశం కావాలని జగన్ కోరడం సరికాదని అయ్యన్న ఘాటుగా విమర్శించారు.
ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చారు రఘురామరాజు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఒక ఎమ్మెల్యే 60 రోజులు సభకు గైర్హాజరైతే అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కు ఉంటుందని ఆయన గుర్తు చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు కూడా ప్రశ్నించలేవని ఆయన స్పష్టం చేశారు. దీంతో, జగన్ అసెంబ్లీకి రావాల్సిందేనని, లేదంటే అనర్హత తప్పదని రఘురామరాజు తేల్చి చెప్పారు.
అయితే, ఇక్కడే ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న తెరపైకి వస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు వంటి పెద్ద నేతలు సభలకు దూరంగా ఉన్నప్పుడు ఈ నిబంధన ఎందుకు వర్తించలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో మూడేళ్లపాటు అసెంబ్లీకి రాలేదు కదా అప్పుడు ఎందుకు అనర్హత వేటు వేయలేదని కూడా నిలదీస్తున్నారు.
ఏది ఏమైనా, రఘురామకృష్ణరాజు మాత్రం జగన్‌ను అనర్హుడిని చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన మాటలను బట్టి చూస్తే, ఈ వ్యవహారం అతి త్వరలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.