ఆర్టీసీ సమ్మెకు కార్మికుల నోటీసు.. దానిపై చర్చలకు ఇప్పడు కోడ్ అడ్డం వచ్చేసింది. ఆర్టీసీ జేఏసీ- ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. జనవరి 27వ తేదీన ఆర్టీసీ జేఏసీ నేతలు యాజమాన్యానికి, లేబర్ కమీషనర్ కు సమ్మె నోటీసు ఇచ్చారు. మొత్తం 21 డిమాండ్లతో సమ్మె నోటీసు అందజేశారు. సమ్మె నోటీసుపై స్పందించిన లేబర్ జాయింట్ కమీషనర్ సునీత గోపాల్ దాస్ ఆర్టీసీ సంస్థకు, జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానిస్తూ.. లేఖలు రాశారు. కానీ..ఎన్నికల కోడ్ నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.



ఈనెల 3వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో చర్చలకు రాలేకపోతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కొనసాగుతున్న కారణంగా....ఆర్టీసీ అధికారులు చర్చలకు రాలేకపోయారని..తనకు సమాచారం ఇచ్చారని లేబర్ జాయింట్ కమీషనర్ సునీత గోపాల్ దాస్ ఆర్టీసీ జేఏసీ నేతలకు తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో చర్చలకు రాలేమని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని లేబర్ కమీషనర్ కార్యాలయంలో నిన్న ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ జేఏసీ సంఘాల నాయకులతో లేబర్ జాయింట్ కమీషనర్ సునీత గోపాల్ దాస్ చర్చలు జరపాలని నిర్ణయించారు.



మరో తేదీన చర్చలు ఖరారు చేస్తామని లేబర్ జాయింట్ కమీషనర్ చెప్పడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు అసహనం వ్యక్తంచేశారు. ప్రభుత్వం,యాజమాన్యం ఎన్నికల కోడ్ పేరుతో దాటవేసే ధోరణి కనబరుస్తోంది అని ఆగ్రహం వ్యక్తంచేశారు. జేఏసీ నేతలంతా సమ్మె పై ఇవాళ సుధీర్ఘంగా చర్చిస్తామని జేఏసీ కన్వీనర్ వెంకన్న తెలిపారు. ఎన్నికల కోడ్ తో సంబంధం లేకుండా ప్రభుత్వం,యాజమాన్యం చర్చలు జరపాలి అని జేఏసీ కో-కన్వీనర్ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ జేఏసీ నేతల సమావేశంలో చర్చించిన అంశాలపై...రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు పేర్కొన్నారు. తమ సమస్యలపై యాజమాన్యం స్పందించకుంటే...సమ్మె చేసేందుకు వెనకాడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: