ఒకప్పటి యుద్దాల గురించి తలుచుకుంటే మనకు భయం వేస్తుంది. విజయం సాధించిన రాజులు ఓడిన రాజ్యాల ఆస్తులను, భార్యలను, కోటలను స్వాధీనం చేసుకునేవారు. ఓడిన రాజులు బానిసలుగా మారేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది, యుద్ధాల తీరు మారింది. సరికొత్త పోరు తెరపైకి వచ్చింది, అదే ఆర్థిక యుద్ధం.

అమెరికా ఎన్నికల రణరంగంలో గెలుపొందిన ట్రంప్, పాత రోజుల్లో రాజుల్లాగే యూరప్ దేశాలపై పంజా విసిరారు. వారిని వేధించారు, వెంటాడారు, విసిగించారు. చివరికి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ లక్ష్యం ఒక్కటే, అమెరికాలో వ్యాపారాలు పెరగాలి, తయారీ రంగం అభివృద్ధి చెందాలి. ఇది ఆయనకు దేశంపై ఉన్న ప్రేమ, భక్తి, దేశభక్తికి నిదర్శనం.

అయితే, ప్రతి దేశానికి తమ దేశభక్తి ఉండాలి. కానీ జపాన్ మాత్రం ట్రంప్ ముందు దాసోహం అన్నట్లు వ్యవహరించింది. జపాన్ ప్రధాని ట్రంప్‌తో భేటీలో జపనీస్ కార్ కంపెనీలన్నీ ఇకపై అమెరికాలోనే ఫ్యాక్టరీలు తెరుస్తాయని ప్రకటించారు. డెట్రాయిట్ నగరం ఒకప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమకు రారాజుగా వెలుగొందింది. వేలాది కార్లు అక్కడ తయారయ్యేవి. కానీ కాలక్రమేణా ఆ వైభవం మరుగున పడిపోయింది. ఇప్పుడు ట్రంప్ మళ్లీ డెట్రాయిట్‌ను మోటార్ సిటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

జపాన్ ప్రధాని ట్రంప్ ప్రతిపాదనకు వెంటనే అంగీకరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జపనీస్ కంపెనీలు అమెరికాలో ఫ్యాక్టరీలు పెడితే సంతోషమే. కానీ అమెరికన్ కంపెనీలు జపాన్‌లో ఫ్యాక్టరీలు పెడతాయా, ఇది జపాన్‌కు నష్టం కలిగించే చర్య కాదా స్వదేశీ పరిశ్రమలను కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? ట్రంప్ ఒత్తిడికి జపాన్ తలొగ్గిందా లేక ఇది వ్యూహాత్మక తప్పిదమా? వేచి చూడాలి. ఏదేమైనా డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వెనుక మస్క్ ఉంటున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు . ఈ నాలుగేళ్ల కాలంలో ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇండియా తో సహా ఇతర దేశాలు ఎలా ప్రభావితం అవుతాయో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: