ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుదల చేస్తామన్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్ధులు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరంలో టీచర్ల ఖాళీల భర్తీ కోసం దీన్ని విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై గత ఏడాది జూన్‌ నుంచి కూటమి సర్కార్ ఊరిస్తూనే ఉంది. అదిగో ఇదిగో అంటూ కాలం సాగదీస్తుంది. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబుతో పాటు విద్యామంత్రి నారా లోకేష్ కూడా రోజుకో ప్రకటన ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు ఆసక్తికర ప్రకటన చేశారు. కేబినెట్‌ భేటీ ముగిసిన తర్వాత ఆయన మంత్రులతో మాట్లాడుతూ.. వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనాల్లోకి వెళ్లేలా కార్యచరణ రూపొందిచాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని, ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు.

అలాగే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు.ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ మార్చిలో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది.16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని, జూన్‌ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది. మంగ ళవారం నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. జీవో 117కు త్వరలో ప్రత్యామ్నాయం తీసుకొస్తామన్నారు. గతంలో టీచర్లకు 45 రకాల యాప్‌లు ఉండేవని, వాటిని ఒక్క యాప్‌లోకి మార్చామని వివరించారు. త్వరలో టీచర్‌ బదిలీల చట్టం తీసుకొస్తామని, అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు పెడతామని చెప్పారు. వీసీల నియామకం తర్వాత రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు ఏకీకృత చట్టం అమలుచేస్తామని శశిధర్‌ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: