భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాజాగా భేటీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. అధ్యక్షుడి అధికారిక నివాసం అయినటువంటి రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్‌లో ఈ సమావేశం ఏర్పాటైంది. 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల లోపే ఈ ఇద్దరు నేతల మధ్య సమావేశం ఏర్పాటు కావడం ప్రపంచ రాజకీయ వర్గాల్లోనే ప్రాధాన్యతను సంతరించుకుంది. భేటీ అనంతరం మోదీ - ట్రంప్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో రష్యా - ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం సహా వివిధ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇద్దరు నేతలు సమాధానాలను ఇచ్చారు.

ఈ నేపథ్యంలో భారత్ కోరిక మేరకు 26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడు అయినటువంటి "తహవ్వూర్ రాణా"ను భారత్‌కు అప్పగించేందుకు ట్రంప్ అంగీకరించడం కొసమెరుపు. పాకిస్తాన్ మూలాలున్న కెనడా పౌరుడైన రాణాపై 2008 ముంబై దాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. దాంతోనే భారత్ ఎంతో కాలంగా రాణాను అప్పగించాలని అమెరికాను అడుగుతోంది. ప్రస్తుతం రాణా అమెరికాలోని హై సెక్యూరిటీ జైలులో ఉన్నట్టు భోగట్టా. ప్రధాని మోదీతో భేటీ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ, “మేము చాలా భయంకరమైన, ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నాం. ఈ వ్యక్తిపై ముంబై ఉగ్రదాడుల ఆరోపణలు ఉన్నాయి!” అని అన్నారు.

ఇకపోతే 2008 నవంబర్‌లో ముంబైపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి విదితమే. ఈ దాడిలో దాదాపు 166 మంది మరణించగా, 300 మందికి పైగా దారుణంగా గాయపడ్డారు. మృతుల్లో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ మూలాలున్న కెనడా పౌరుడైన రాణా, 2008 ముంబై దాడులకు కుట్ర పన్ని, సహకరించినట్లు అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. అమెరికా కోర్టు రాణాను భారత్‌కు అప్పగించేందుకు అనుమతి ఇవ్వడంతో అతన్ని ఇండియాకు తీసుకురావడానికి మార్గం సుగమమైంది. ఈ చర్య భారత్ - అమెరికా మధ్య ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: