అవును, మీరు విన్నది నిజమే. పద్మశ్రీ అవార్డు విషయంలో హైకోర్టులో వింత పంచాయితీ చోటుచేసుకుంది. సాహిత్య రంగంలో వచ్చిన పద్మశ్రీ అవార్డు నాదంటే నాదే అంటూ... 'అంతర్యామి మిశ్రా' అనే పేరు గల ఇద్దరు వ్యక్తులు ఒడిశా హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టులోని జడ్జీతో సహా అందరు షాక్ కు గురయ్యారు. విషయంలోకి వెళితే... కేంద్రం 2023లో పద్మశ్రీ అవార్డులు ప్రకటించగా లిస్టులో తన పేరు ఉండటంతో వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన అంతర్యామి మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును స్వీకరించాడు. ఇక్కడే ట్విస్ట్ మొదలయ్యింది. అది తనకు వచ్చిన అవార్డు అని పేర్కొంటూ ఒడిశాకు చెందిన డాక్టర్ అంతర్యామి మిశ్రా హైకోర్టును తాజాగా ఆశ్రయించాడు.

ఈ క్రమంలో తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును తన పేరు గల ఓ జర్నలిస్ట్ అందుకున్నాడని తన ఫిటిషన్ లో వివరించాడు అదేపేరు గల వ్యక్తి అంతర్యామి మిశ్రా. ఆయన ఒడియాతోపాటు ఇతర భారతీయ భాషలలో తాను 29 పుస్తకాలు రచించినట్లు కూడా తెలిపాడు. అందుకే పద్మశ్రీ అవార్డు గ్రహీతల జాబితాలోని 56వ స్థానంలో తన పేరు చేర్చారని, జర్నలిస్ట్ అయిన అంతర్యామి మిశ్రా అయితే ఇంతవరకు ఎటువంటి పుస్తకం రాయలేదని.. కానీ అతనికి ఎలా అవార్డు ఇచ్చారని పేర్కొన్నాడు.

కాగా ఈ పిటిషన్ ను జస్టిస్ ఎస్.కె పాణిగ్రాహి మంగళవారం కోర్టులో విచారించారు. ప్రభుత్వం ధ్రువీకరణ ప్రక్రియను కచ్చితత్వంతో నిర్వహించినప్పటికీ కూడా... ఒకే విధమైన పేర్ల కారణంగా ఈ గందరగోళం ఏర్పడిందని, పూర్వాపరాలు పరిశీలిస్తామని, దానికి కొంత సమయం కావాలని  కోర్టు వ్యాఖ్యానించింది. కాగా ఈ గందరగోళం పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియ విశ్వసనీయతపైనే ఆందోళనలను లేవనెత్తుతుందని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు క్లెయిందారులిద్దరూ తమ వాదనలను నిరూపించడానికి అన్ని ప్రచురణలను కోర్టుకు ఖచ్చితంగా సమర్పించాలని స్పష్టం చేసింది. అంతర్యామి మిశ్రా అనే పేరున్న ఇద్దరూ విచారణకు భౌతికంగా హాజరు కావాలని కోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: